తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రే ఈ సైరా చిత్రం. ఈ చిత్రంలో నటించాలని చిరంజీవి ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కానీ బడ్జెట్ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. రాంచరణ్ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించాడు. 

ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అభిమానులంతా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ముందుగా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లని సెప్టెంబర్ 18న ప్లాన్ చేశారు. వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 

కానీ అనూహ్యంగా ప్రీరిలీజ్ వేడుక వాయిదా పడింది. వాయిదాకు గల కారణాన్ని తాజాగా చిత్ర యూనిట్ వివరించింది. 18వ తేదీ హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా ఉండదని రిపోర్ట్స్ రావడంతో వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీరిలీజ్ వేడుకని సెప్టెంబర్ 22న నిర్వహించబోతున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. 

ఇక ట్రైలర్ మాత్రం అనుకున్న సమయానికే సెప్టెంబర్ 18 బుధవారం రోజు విడుదల కానున్నట్లు ప్రకటించారు. సౌత్ ఇండియన్ అన్ని భాషలు, హిందీలో భారీ స్థాయిలో సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా జనసేనాని పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ హాజరు కానుండడం విశేషం.