సారాంశం
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ తరపున పాల్గొనబోయే నందినీ గుప్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సెప్టెంబర్ 2003లో రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జన్మించిన నందినీ గుప్తా, 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ తరపున పాల్గొనబోయే నందినీ గుప్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సెప్టెంబర్ 2003లో రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జన్మించిన నందినీ గుప్తా, 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు ఆమె 72వ మిస్ వరల్డ్ అంతర్జాతీయ పోటీలో ఇండియా నుంచి కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు.
ఈ ఏడాది మిస్ వరల్డ్ గ్రాండ్ ఈవెంట్ మే 31, 2025న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరగనుంది. ఇది వరుసగా రెండోసారి భారత్‌లో మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ కావడం విశేషం. ప్రారంభ వేడుక మే 10న హైదరాబాద్‌లోని ట్రిడెంట్ హోటల్లో ఘనంగా జరగనుంది.
ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా నందినీ గుప్తా మాట్లాడుతూ, “మన దేశంలోనే మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరపున పోటీ చేయడం ఎంతో గర్వంగా ఉంది. తెలంగాణ ఆతిథ్యం, సంస్కృతి మిస్ వరల్డ్ పోటీలని మరింత స్పెషల్ గా మార్చేస్తున్నాయి. ప్రపంచాన్ని ఇక్కడకు ఆహ్వానించడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను,” అని చెప్పారు.
రాజస్థాన్‌లోని కోటా పట్టణానికి చెందిన నందినీ ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. “నాన్న వ్యవసాయదారుడు, అమ్మ గృహిణి. నాకు ఒక చెల్లి ఉంది. మా ఇంటి లాబ్రడార్ పెంపుడు కుక్క పేరు బాంజో. నూనెలు, సజ్జలు, శనగల పంటలు, పొలాల మధ్యనే నా బాల్యం గడిచింది,” అని ఇంటర్వ్యూలో నందినీ తెలిపారు. కోటాలోని సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదివిన ఆమె, ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేశారు.
‘బ్యూటీ విత్ పర్పస్’కు అనుగుణంగా నందినీ ‘ప్రాజెక్ట్ ఏకతా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సమాజంలో ఒప్పుకొనే భావన, పరస్పర గౌరవాన్ని పెంపొందించాలనే అభిమతం ఉంది.
“మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కాదు, మీరు ఎక్కడికి చేరాలని భావిస్తున్నారు అనేదే ముఖ్యమైనది.” అనే విషయాన్ని నందినీ స్పష్టంగా చెప్పారు. దేశానికి పేరు తెచ్చే ఈ వేదికపై నందినీ విజయాన్ని అందుకోవాలని భారత్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.