`కుబేర` చిత్రంలో తన పాత్ర గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ట్రోల్స్ కి గురి కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చారు. `కుబేర` సక్సెస్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.
కింగ్ నాగార్జున తనని తాను మార్చుకుంటున్నారు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన `కుబేర` చిత్రంలో నటించారు. ధనుష్‌తో కలిసి ఆయన ఇందులో నటించడం విశేషం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
`కుబేర` ప్రెస్ మీట్‌లో నాగార్జున కామెంట్స్ పై ట్రోల్స్
ఇందులో నాగార్జున మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చారు. శనివారం ప్రెస్ మీట్‌లో ఆయన `కుబేర` సినిమాలో తనదే మెయిన్ రోల్ అని, దీపక్ పాత్ర చుట్టూనే మిగిలిన పాత్రలు, కథ అంతా తిరుగుతుందని, అదే మెయిన్ గా అనిపించిందని, మూడు షేడ్స్ ఉన్నాయని తెలిపారు.
అదే సమయంలో ధనుష్ రోల్ ప్లాట్‌గా ఉంటుందని తెలిపారు. ఇది ట్రోల్ కి కారణమైంది. మీడియాలోనూ అలాగే ధనుష్ ఫ్యాన్స్ కూడా దీన్ని వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన నాగార్జున
ఈ నేపథ్యంలో తాజాగా దీనికి కౌంటర్ ఇచ్చారు నాగార్జున. తాను ప్రెస్ మీట్‌లో దీపక్ పాత్ర మెయిన్‌గా ఉంటుందని, కథకి, అన్ని పాత్రలకు కీలక పాయింట్‌గా ఉందని, ఈ మూవీ నా సినిమా కాదా అని చెప్పాను, కానీ దాన్ని తీసుకెళ్లి ట్రోల్స్ చేశారు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
రిలీజ్‌కి ముందు శేఖర్ కమ్ముల మూవీ అంటున్నాడు, రిలీజ్ తర్వాత తన సినిమా అంటున్నాడని హడావుడి చేస్తున్నారు. మళ్లీ చెబుతున్నా, ఈ మూవీ దేవా సినిమా, దీపక్ సినిమా, సమీరా సినిమా, ఇది ఖుష్బూ మూవీ, కేలు సినిమా ఇలా అందరి సినిమా,
కానీ ఫైనల్‌గా ఇది శేఖర్ కమ్ముల సినిమా అని తెలిపారు నాగార్జున. ఈ సందర్భంగా దర్శకుడికి థ్యాంక్స్ చెప్పిన ఆయన తనకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారని అన్నారు.
రివ్యూలు, శేఖర్, రష్మిక, దేవి, చిరంజీవిగారు చెప్పాక నాకు నమ్మకం వచ్చింది
`సినిమా విడుదలయ్యాక రివ్యూస్‌లో తన యాక్టింగ్ గురించి రాశారు, అప్పుడు నాకు బాగా చేశాననే ఫీలింగ్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత చెన్నైలో సినిమా చూసి శేఖర్ కమ్ముల పెట్టిన మెసేజ్‌కి నమ్మకం పెరిగింది.
దేవిశ్రీ ప్రసాద్‌ని అడిగాను, ఆయన ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌కి సంతోషం వేసింది. రష్మిక కూడా ఫెంటాస్టిక్ అని చెప్పింది. చిరంజీవిగారు కారులో వస్తే నాగ్ బాగా చేశావ్, దీపక్‌గా అదరగొట్టావన్నారు. దీంతో నేనుకూడా బాగా చేశానని, కొత్తగా చేశాననే ఫీలింగ్ కలిగింద`ని చెప్పారు నాగ్.
ఇంత మంది చెప్పాక తనకు శేఖర్ కమ్ముల గొప్పతనం ఏంటో అర్థమయ్యిందన్నారు. అలాగే ధనుష్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా మొత్తం చేయి పనిచేయని విధంగానే నటించాడు, అలా చేయడం అంత ఈజీ కాదని తెలిపారు. సెట్‌లో ధనుష్‌ని గుర్తుపట్టలేదని, అంతగా పాత్రలో ఒదిగిపోయాడని తెలిపారు నాగ్.
మరో నలభై ఏళ్లు నాకు తిరుగులేదు
అలాగే రష్మికపై ప్రశంసలు కురిపించారు నాగ్. ఆమెని ఈ మూవీలో చూస్తుంటే `క్షణక్షణం`లో శ్రీదేవి గుర్తుకు వచ్చారని తెలిపారు. దీంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది రష్మిక. ఆమె నేషనల్ క్రష్ మాత్రమే కాదు, ఇప్పుడు నాగ్ క్రష్ కూడా అని నాగార్జున కామెంట్ చేయడం విశేషం.
అంతేకాదు ఈ సందర్భంగా తన నటన గురించి, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమాతో తనకు కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయని, ఒక కొత్త ప్రపంచం ఓపెన్ అయ్యిందన్నారు. `శేఖర్ మీకు తెలియదు, దీని వల్ల నా ప్రపంచం ఓపెన్ అయ్యింది.
ఎలాంటి పాత్రలు చేయోచ్చనేది తెలిసింది. ఇకపై నాకు భలే క్యారెక్టర్స్ వస్తాయి. అంతేకాదు మరో నలభై ఏళ్లు నాకు తిరుగులేదు` అని తెలిపారు నాగార్జున. ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి.