`కుబేర` మూవీ కలెక్షన్ల విషయంలో, హీరో అనే విషయంలో నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. నాగార్జునపై ధనుష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నాగార్జున, ధనుష్ హీరోలుగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కుబేర`. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చినా, ఆ రేంజ్‌లో కలెక్షన్లు కనిపించడం లేదు. ఓపెనింగ్ రోజే ఇది యావరేజ్ కలెక్షన్లని రాబట్టింది.
అయితే చిత్ర బృందం నెగటివ్ పబ్లిసిటీని కంట్రోల్ చేయడంతో కొంత సినిమాకు హెల్ప్ అవుతుందని తెలుస్తోంది. ఈ మూవీ వీకెండ్స్ కి మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది.
కానీ వీక్ డేస్‌లోనే ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి. సోమవారం రోజుతో ఈ మూవీ హిట్ అవ్వగలదా? లేదా అనేది తేలిపోనుంది.
`కుబేర` మూవీ రెండు రోజుల కలెక్షన్లు
ఇక తాజాగా `కుబేర` మూవీ రెండు రోజుల కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ముప్పై కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. రూ. 14కోట్ల షేర్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇది రూ.26కోట్ల గ్రాస్, రూ.13కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం.
ఇక రెండో రోజు ఈ చిత్రం రూ.16కోట్ల షేర్ వచ్చిందని పలు ట్రేడ్ సైట్లు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 26 నుంచి రూ.30కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు సమాచారం. ఈ మూవీకి సుమారు రూ.60కోట్ల బిజినెస్ జరిగింది.
బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.120కోట్ల గ్రాస్, రూ.60కోట్ల షేర్ రావాలి. మరి దాన్ని రీచ్ అవుతుందా అనేది చూడాలి. అయితే ఆదివారం ఆక్యుపెన్సీ డల్‌గా ఉందని బుకింగ్స్ ని బట్టి తెలుస్తుంది. శుక్రవారంతో పోల్చితే శనివారం ఆక్యుపెన్సీ పెరిగింది.
దీంతో కలెక్షన్లు పెరిగాయి. కానీ సండే రోజు ఆ రేంజ్ బుకింగ్స్ లేవు. దీంతో మూడో రోజు `కుబేర` కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. ఈ లెక్కన మూడో రోజు పది కోట్ల వరకు షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే ఇంకా ఇరవై కోట్ల షేర్ రావాలి. అది సాధ్యమవుతుందా అనేది చూడాలి.
ప్రమోషన్స్ జోరు పెంచుతున్న `కుబేర` టీమ్, రంగంలోకి చిరంజీవి
సినిమా డల్ అవుతున్న నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచుతుంది. శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ సెలబ్రేట్ చేశారు. ఇక ఆదివారం సక్సెస్ మీట్‌ని నిర్వహిస్తున్నారు.
దీనికి ధనుష్‌తోపాటు నాగార్జున, రష్మిక మందన్నా, శేఖర్ కమ్ముల ఇలా టీమ్ మొత్తం హాజరు అయ్యింది. వారితోపాటు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రావడం విశేషం. ఇదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.
`కుబేర` మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ బాగా శ్రమిస్తుందని చెప్పొచ్చు. రిలీజ్‌కి ముందు పెద్దగా ప్రమోట్ చేయలేదు. దీంతో ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడింది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ పెంచుతున్నారు. ఇది సినిమాకి ఎంత మేరకు వర్క్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో `కుబేర` సినిమాకి సంబంధించిన విచిత్రమైన చర్చ నడుస్తోంది. ధనుష్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ మధ్య చిన్న పాటి వార్ నడుస్తోంది. ఈ చిత్రం తెలుగులోనే సత్తా చాటుతుంది.
కానీ తమిళంలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోతుంది. ధనుష్ సొంత స్టేట్‌లోనే ఈ మూవీ డల్‌గా రన్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. కానీ తమిళనాడుతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా తెలుగు కలెక్షన్లు ఉండటం విశేషం.
నాగార్జున, శేఖర్ కమ్ముల జోరు ముందు వెనకబడ్డ ధనుష్
`కుబేర` చిత్రం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వసూళ్లని రాబట్టింది. నైజాం, ఆంధ్రలో ఈ చిత్రం రూ.24కోట్లు వసూలు చేస్తే, అదే తమిళనాడులో రూ.9 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం రూ.14కోట్లు వసూలు చేసింది.
కర్నాటకలో సుమారు నాలుగు కోట్లు, నార్త్ లో కోటిన్నర, కేరళా అరకోటి వసూలు చేసింది. ఇలా యాభై నాలుగు కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. అయితే కోలీవుడ్‌లో ఈ మూవీ ఓవర్సీస్‌కి వచ్చిన కలెక్షన్లు కూడా రాకపోవడం ఆశ్చర్యపరుస్తుంది.
ధనుష్ కోలీవుడ్‌లో స్టార్ హీరో. ఆయన సినిమాలు అక్కడ మంచి ఓపెనింగ్స్ ని రాబడతాయి. కానీ `కుబేర` మూవీ అక్కడ చాలా వెనకబడిపోయింది. ఆయన సొంత స్టేట్‌లోనే సత్తా చాటకపోవడంతో నాగార్జున ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.
ఇప్పటికే హీరో ఎవరనే వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్లలో ధనుష్ సొంత స్టేట్‌లో వెనకబడిపోవడం ఆశ్చర్యంగా మారింది. దీన్నే ఛాన్స్ గా తీసుకుని రెచ్చిపోతున్నారు నాగార్జున ఫ్యాన్స్. నాగార్జున, శేఖర్ కమ్ముల క్రేజ్ ముందు ధనుష్ వెనకబడిపోయాడని అంటున్నారు.
అయితే `కుబేర`లో హీరో ధనుష్ తప్ప, నాగార్జున, రష్మిక, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మించిన నిర్మాతలు అంతా తెలుగువారే. దీంతో తెలుగు మూవీగానే ప్రమోట్ అయ్యింది. కలెక్షన్లు కూడా అదే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ వార్
ఇదిలా ఉంటే ఇప్పుడు ధనుష్, నాగార్జున ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. శనివారం ప్రెస్ మీట్‌లో నాగార్జున చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆయన ఈ మూవీకి తానే హీరో అన్నట్టుగా మాట్లాడారు. తనదే మెయిన్ రోల్ అన్నారు.
తన పాత్రతోనే సినిమా కథ స్టార్ట్ అవుతుందని, తన పాత్ర ప్రధానంగానే కథ నడుస్తోందని, తన పాత్రలో మూడు భిన్నమైన షేడ్స్ ఉన్నాయని, అందుకే తన పాత్రనే మెయిన్‌గా భావిస్తున్నట్టు తెలిపారు నాగార్జున. శేఖర్ కమ్ముల కూడా అదే చెప్పారని వెల్లడించారు.
అదే సమయంలో ధనుష్ పాత్రని తక్కువ చేసినట్టుగా మాట్లాడారు. ధనుష్ పాత్ర తన కథలోకి వస్తుందని, ఆయన పాత్రలో పెద్దగా లేయర్స్ లేవని, ఒకే జోన్ లో నడుస్తుందని, ఎలాంటి ఎత్తు పల్లాలు లేకుండా వెళ్తుందని తెలిపారు నాగ్.
దీనికి ధనుష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. నాగార్జునని ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. నాగార్జున ఇన్ సెక్యూర్‌లో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. సినిమా క్రెడిట్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
సినిమా రిలీజ్‌కి ముందు ఇది శేఖర్ కమ్ముల మూవీ అని చెప్పిన నాగార్జున ఇప్పుడు తన సినిమాగా చెబుతున్నాడని అంటున్నారు. ఇది నెట్టింట పెద్ద రచ్చ అవుతుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.