ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా కింగ్ నాగార్జున కనిపించబోతున్నారట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి సర్వం సిద్ధం కాగా ప్రకటనే తరువాయన్న మాట వినిపిస్తుంది. విషయంలోకి వెళితే ఆనందో బ్రహ్మ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి రాఘవ గత ఏడాది దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర తెరకెక్కించారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసిన పాదయాత్ర ఎలా ఉపయోగపడింది, ప్రజాకర్షక పథకాలకు ఎలా నాంది పలికింది వంటి విషయాలు ఆ మూవీలో చూపించారు. 

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వై ఎస్ రాజశేఖర్ రెడ్డిగా అద్భుతంగా నటించారు. ఆయన నటన చాలా హుందాగా, సహజంగా ఉండడంతో పాటు రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసింది.ఇక యాత్ర చిత్ర ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది.  కాగా ఈ మూవీ తరువాత దర్శకుడు మహి రాఘవ మరో మూవీ ప్రకటించలేదు. అయితే అప్పటి నుండి మహి రాఘవ యాత్ర 2 స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారట. కాగా ఈ మూవీలో జగన్ గా నాగార్జున కనిపించడం దాదాపు ఖాయం అంటున్నారు.  

యాత్ర 2లో మహి రాఘవ వై ఎస్ ఆర్ మరణం తరువాత ఏర్పడిన పరిస్థితులు, జగన్ ఎదుర్కొన్న రాజకీయ వేధింపులు, పాదయాత్ర, సీఎం పీఠం ఎక్కడం వంటి విషయాలను ప్రస్తావిస్తారట. ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ చేస్తన్న నాగార్జున, తదుపరి చేయనున్నది యాత్ర 2 అని గట్టిగా వినిపిస్తుంది.ఇక నాగార్జున వై ఎస్ జగన్ గా నటిస్తారన్న వార్త సినీ మరియు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకు దారి తీస్తుంది. గొప్ప నటుడిగా పేరున్న నాగార్జున జగన్  పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారనిపిస్తుంది.