మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వివాదంతో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వారిని విచారణ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. 

మే 31న 72 వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో ఘనంగా ముగిశాయి. అంతా సవ్యంగా జరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా సంఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో కంటెస్టెంట్స్ అందరికీ ప్రభుత్వం గ్రాండ్ గా విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మిస్ వరల్డ్ పోటీల్లో ఇంగ్లాండ్ తరపున మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ పాల్గొన్నారు. కానీ మధ్యలోనే ఆమె మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగారు. కుటుంబ కారణాల వల్ల ఆమె మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె మీడియా ముందు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

వేశ్యలాగా ఫీల్ అయ్యేలా చేశారు 

చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందులో తనతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, తాను వేశ్యలాగా ఫీల్ అయ్యేలా చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తాజాగా కమిటీ నివేదికని ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు అయిన ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు బాధ్యులుగా గుర్తించబడ్డట్లు తెలుస్తోంది.

విచారణ కమిటీ గుర్తించింది ఎవరిని ?

వివరాల్లోకి వెళితే, TGMRIES అధ్యక్షుడు ఫహీం ఖురేషి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మిస్ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీతో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని అంటున్నారు. 

చౌమహల్లా ప్యాలెస్‌ విందు కార్యక్రమంలో ఆరుగురు అతిథులు ఉన్న టేబుల్ కి ఇద్దరేసి సుందరీమణులు కూర్చోవాలని, రాత్రంతా వారిని ఎంటర్టైన్ చేయాలని తనతో చెప్పినట్లు మిల్లా మాగీ ఆరోణలు చేసింది. 

సీసీటీవీ ఫుటేజ్‌ తో వెలుగులోకి.. 

చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఈ ఇద్దరు నేతలు కూడా కూర్చున్నారని, వారు ప్రవర్తించిన తీరు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రికార్డ్ అయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఆధారాలతోనే విచారణ కమిటీ వారి పేర్లని నివేదికలో చేర్చింది. మిల్లా మాగీని ఇబ్బంది పెట్టింది వారిద్దరే అని విచారణ కమిటీ తేల్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

పేర్లు బయటకి రాకుండా జాగ్రత్తలు ?

వీరిద్దరి పేర్లు మీడియాకి లీక్ అయ్యాయి. కానీ వారి పేర్లు అధికారికంగా బయటకి రాకుండా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది అధికారికంగా నిజమని తేలితే రేవంత్ రెడ్డి సర్కార్ కి చెడ్డపేరు వస్తుంది. అందువల్లే వారి విషయంలో గోప్యత పాటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

జయేష్ రంజన్ మీడియాపై ఆగ్రహం

ఈ వ్యవహారంపై మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ అధికారి జయేష్ రంజన్ స్పందించాలని మీడియా ప్రశ్నించగా, ఆయన ఆగ్రహంతో మీడియాని దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీనితో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన మంత్రి పొన్నం 

ఒకవైపు మిల్లా మాగీ వివాదం సంచలనంగా మారుతుండగా.. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి జూపల్లి, మంత్రి పొన్నం ప్రభాకర్ కలసి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మరోసారి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహించే ఆలోచన ఉందా ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. 

పొన్నం ప్రభాకర్ సమాధానం ఇస్తూ.. అంత లేదు.. వాళ్ళు రమ్మన్నా రారు, అడిగినా రారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొన్నం కామెంట్స్ తో పక్కనే ఉన్న జూపల్లి షాక్ అయ్యారు. పొన్నం అలా ఎందుకు అనాల్సి వచ్చింది అనేది తెలియాల్సి ఉంది.