Akhanda: బెనిఫిట్ షోలతో దోచేస్తున్నారు- కేతిరెడ్డి
అఖండ (Akhanda)మూవీ నేడు గ్రాండ్ గా విడుదలవుతుండగా మూవీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బెనిఫిట్ షోల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. టికెట్స్ ధరలు, ఆన్లైన్ విధానం, బెనిఫిట్ షోల రద్దు వంటి కీలక అంశాలు చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే నేడు విడుదలవుతున్న అఖండ మూవీ బెనిఫిట్ షోలు రాష్ట్రంలో ప్రదర్శిస్తూ భారీగా టికెట్స్ ధరలు వసూలు చేస్తున్నారని కేతిరెడ్డి తెలియజేశారు. రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉదయం 6గంటలకు, 9 గంటలకు అఖండ షోలు ప్రదర్శించారని అన్నారు.
స్వచ్ఛంద సంస్థల పేరుతో పోస్టర్స్ ముద్రించి టిక్కెట్స్ కావలసినవారు సంప్రదించవలసిన నంబర్లని తెలియచేస్తూ వాట్సప్ గ్రూపులలో పెట్టి అమ్మతున్నట్లు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని ఆ సినిమా థియేటర్ టికెట్లను రెవెన్యూ, హోం శాఖ ద్వారా బుకింగ్స్‌లో అమ్మేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అదే సమయంలో రోజుకు నాలుగు షోలు, అన్ని సినిమాలకు ఒకే విధమైన టికెట్స్ ధరలు, ఆన్లైన్ అమ్మకాలు వంటి ప్రభుత్వ నిర్ణయాలు సినిమా అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. చిన్న నిర్మాతలకు, సినిమా కార్మికులకు ఈ విధానాలు మేలు చేస్తాయని తన అభిప్రాయం వెల్లడించారు.
Also read Akhanda: 'అఖండ' ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో బాలయ్య శివతాండవం