కన్నడనాట కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శాండల్‌వుడ్‌ తారలు సంజనా, రాగిణి ద్వివేదిలకు కోర్ట్ లో చుక్కెదురయ్యింది. డ్రగ్స్ కేసులో వీరి తరపున వేసిన బెయిల్‌ పిటిషన్‌ని కోర్ట్ తిరస్కరించింది. సంజనా స్నేహితుడు రాహుల్‌ బెయిల్‌ పిటిషన్‌ని కూడా కోర్ట్ కొట్టేసింది. 

కర్నాటక డ్రగ్స్ కేసులో సంజనా గల్రాని, రాగిణి ద్వివేది, టీవీ నటి అనుశ్రీతోపాటు కిశోర్‌ అమన్‌, తరుణ్‌ రాజ్‌ల పేర్లు ప్రధానంగా వినిపించిన విషయం తెలిసిందే. ఓ వైపు వెండితెర, మరోవైపు బుల్లితెరకు చెందిన ప్రముఖుల పేర్లు ఈ కేసులో బయటకు వచ్చాయి. 

టీవీ యాంకర్ అకుల్ బాలాజీ ఇటీవలే బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణను ఎదుర్కోగా, డ్యాన్సర్, బాలీవుడ్ నటుడు కిశోర్‌ అమన్‌ శెట్టిలతోపాటు ఆయన మిత్రుడు తరుణ్‌లను ఇప్పటికే మంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి అనుశ్రీ ఫ్రెండ్‌. వీరంతా మంగుళూరుకు చెందిన వారే కావడం గమనార్హం. 

కిశోర్‌ శెట్టి నిర్వహించిన అనేక పార్టీలలో డ్రగ్స్ వాడినట్టు పోలీసులకు సమాచారం ఉంది. వీటిలో కొన్ని పార్టీలలో అనుశ్రీ పాల్గొన్నట్టు తెలిసింది. ఈ పార్టీల గురించే అనుశ్రీని సీసీబీ పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.