కన్నడ వివాదంపై తగ్గేది లేదు అంటున్నారు కమల్ హాసన్. తన వ్యాఖ్యల విషయంలో సారి చెప్పేది లేదంటున్నారు. అటు కన్నడ సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం సారి చెపితేనే థగ్ లైఫ్ రిలీజ్ అవుతుందన్నారు. ఈక్రమంలో కమల్ హాసన్ హైకోర్టు ను ఆశ్రయించారు.

తమిళ స్టార్ నటుడు కమల్‌ హాసన్‌ తాజాగా కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద వివాదానికి దారి తీశాయి. "కన్నడం తమిళం నుంచే పుట్టిన భాష" అనే వ్యాఖ్యను కమల్‌ హాసన్‌ చేసిన నేపథ్యంలో, కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కమల్‌ హాసన్‌ వెనక్కి తగ్గకపోవడంతో, ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడానికి వీల్లేదని కన్నడ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పష్టం చేసింది.

ఈ సినిమా విడుదలపై ఫిల్మ్‌ ఛాంబర్‌ బాన్‌ విధించడంతో వివాదం మరింత ముదిరింది. కమల్‌ హాసన్‌ మాత్రం తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ‘‘ప్రేమతోనే అలా మాట్లాడాను, ప్రేమ ఎప్పుడూ క్షమాపణలు చెప్పదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. భాషా చరిత్రపై తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ద్వేషము లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలో థగ్‌ లైఫ్‌ సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కమల్‌ హాసన్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమా ప్రదర్శనకు తగిన భద్రత కల్పించాలని డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌లకు సూచనలు జారీ చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, ఫిల్మ్‌ ఛాంబర్‌, ఇతర సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు.

కమల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఫిల్మ్‌ ఛాంబర్‌ మాత్రం కమల్‌ క్షమాపణలు చెప్పేంత వరకూ సినిమా విడుదలను అనుమతించబోమని మరోసారి స్పష్టం చేసింది. థగ్‌ లైఫ్‌ సినిమా జూన్‌ 5న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నా, కర్ణాటకలో మాత్రం రిలీజ్ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ సినిమా దాదాపు 35 ఏళ్ళ తరువాత మణిరత్నం, కమల్‌ హాసన్‌ కాంబినేషన్ లో తెరకెక్కింది. ఇంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.