తమిళ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కమల్ హాసన్‌పై ఫిర్యాదు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆయన వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, తమిళులు-కన్నడుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కమల్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. వివాదం తారాస్థాయికి చేరడంతో కమల్ హాసన్ మీడియా ద్వారా స్పందిస్తూ సారీ చెప్పారు. “తాను ఆ వ్యాఖ్యలు ప్రేమతో చేశాను. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు” అని స్పష్టం చేశారు. భాషల చరిత్రపై మాట్లాడే అర్హత రాజకీయ నేతలకు లేదని, ఆ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేయాలని సూచించారు.
ఇదే సమయంలో, కర్ణాటక వ్యాప్తంగా కమల్ హాసన్ చిత్రాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ‘థగ్ లైఫ్’ సినిమా పోస్టర్లు దహనం చేయడం, కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం చోటుచేసుకుంది. ఈ వివాదం థగ్ లైఫ్ సినిమా విడుదలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, “కమల్‌కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదు. ఇతర భాషలను అవమానించడం తగదు” అని చెప్పారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నేతలు కమల్ హాసన్ సినిమాలను కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, “ఈ దేశం భాషా సమ్మేళనం, ప్రేమతో ముందుకు సాగాలి. భాషను రాజకీయంగా వాడకూడదు” అని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కర్ణాటకలో పరిస్థితి గంభీరంగా మారడంతో పోలీసుల జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి.