చాలా మంది నటులు డబ్బుతో వ్యాపారాలు చేసి మరింత సంపాదిస్తుంటారు. కానీ, మనందరికీ తెలిసిన ప్రముఖ నటుడు సయాజీ షిండే మాత్రం చెట్లను నాటి, పచ్చదనాన్ని పెంచి తన తల్లిని చిరంజీవిగా నిలిపారు. లక్షల చెట్లతో ఓ పర్యావరణ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. మరి ఆ కథేంటో చూస్తే,
నటుడు సయాజీ షిండే పర్యావరణ ఉద్యమం
మనం ఎవరినైనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు, వాళ్లను ఎక్కడ కోల్పోతామో అనే భయం మనల్ని వెంటాడుతుంది. కానీ నటుడు సయాజీ షిండే ఆ భయాన్నే ఒక అవకాశంగా మార్చుకున్నారు. మహారాష్ట్రలోని వేలాది గ్రామాలకు కొత్త ఊపిరి పోసే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒక కొడుక్కి తల్లిపై ఉన్న ప్రేమతో మొదలైన ఈ ప్రయాణం, ఈరోజు దేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన పర్యావరణ ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఉద్యమం ద్వారా సయాజీ షిండే ఇప్పటివరకు 6.5 లక్షల చెట్లను నాటి, తన తల్లి శ్వాసను పచ్చదనంలో నిలిపారు.
వాచ్‌మెన్‌గా చేసిన సయాజీ షిండే
సయాజీ షిండే మనందరికీ సుపరిచితమైన నటుడే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరించారు. అయితే ఆయన పుట్టుకతో శ్రీమంతుడు కాదు, నటుల కుటుంబం నుంచి కూడా రాలేదు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే కష్టాలు చూశారు. 1978లో, ప్రభుత్వం ఒక డ్యామ్ ప్రాజెక్ట్ కోసం వాళ్ల భూమిని తీసుకుంది. దానికి బదులుగా, నీటిపారుదల శాఖలో వాచ్‌మెన్ ఉద్యోగం ఇచ్చింది. 35 ఏళ్ల తర్వాత గానీ, ప్రభుత్వం అప్పుడు ఇస్తానన్న భూమి వాళ్ల చేతికి రాలేదు. అయితే, 2016లో తన తల్లిని కోల్పోయినప్పుడు జీవితం అంటే ఏంటో ఆయనకు నిజంగా అర్థమైంది. ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం, మనిషి కష్టాలను తీర్చలేనప్పుడు ఆ డబ్బు ఉండి కూడా వ్యర్థమే అని ఆయన అనుకున్నారు.
తల్లిని బతికించుకోవడానికి చెట్లు
ఈ ఉద్యమం వెనుక ఒక ఎమోషనల్ కథ ఉంది. 2016లో సయాజీ తల్లికి 92 ఏళ్లు. ఆమెను కోల్పోతాననే భయం ఆయన్ని వెంటాడింది. ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ తనతో శాశ్వతంగా ఉండలేదని, ఆమె పక్కన కూర్చొని మరణాన్ని ఆపలేనని ఆయనకు అర్థమైంది. అందుకే, తన తల్లి ఉనికిని ఏదో ఒక రూపంలో ఎప్పటికీ నిలిపి ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచన నుంచే చెట్లు నాటాలనే సంకల్పం పుట్టింది.
ప్రాచీన సంప్రదాయం వైపు అడుగులు
సయాజీ వెంటనే హైదరాబాద్ నుంచి రెండు ట్రక్కుల మొక్కలను ఆర్డర్ చేశారు. ఒక్కో ట్రక్కు ఖరీదు సుమారు లక్ష రూపాయలు. అదే సమయంలో, ఆయన 'దేవరై' అనే ప్రాచీన భారతీయ సంప్రదాయం గురించి తెలుసుకున్నారు. 'దేవరై' అంటే తరతరాలుగా ఒక సమాజం కాపాడుకుంటూ, పూజించే పవిత్రమైన వనాలు. ఈ ఆలోచనతో స్ఫూర్తి పొంది, ఆయన అడవులను సృష్టించడం మొదలుపెట్టారు. తన తల్లి పేరు మీద వాటికి 'సహ్యాద్రి దేవరై' అని పేరు పెట్టారు.
నవ్విన వాళ్లే అభినందిస్తున్నారు
ఇప్పుడు, సయాజీ షిండే ఏకంగా 48 ప్రాంతాల్లో ఈ పనులు చేస్తున్నారు. వేల చెట్లతో మొదలుపెట్టి, ఇప్పుడు లక్షల చెట్లను నాటారు. వాటిలో చాలా వరకు పండ్లనిచ్చే, పచ్చని అడవులుగా మారాయి. ఈ ఉద్యమం కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాలేదు. ఇది జీవనోపాధి, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు, గ్రామాల పునర్నిర్మాణానికి కూడా దారితీసింది. ఆదాయం ఇచ్చే చెట్లను నాటడం వల్ల ప్రజలకు కూడా మేలు జరుగుతోంది. ఒక గ్రామంలో 2,000 చెట్లతో మొదలైన ఈ యజ్ఞం, ఇప్పుడు ఒక దశాబ్ద కాలంలో ప్రజా ఉద్యమంగా మారింది. ఒకప్పుడు ఆయన మొక్కలు నాటుతుంటే నవ్విన గ్రామస్థులే, ఇప్పుడు ప్రేమతో, గర్వంగా వాటికి నీళ్లు పోస్తున్నారు. మహారాష్ట్ర అంతటా పూల పరిమళాలు, చల్లని నీడ, పండ్లతో నిండిన సుమారు 6.5 లక్షల చెట్లను సయాజీ నాటారు. ఈ లక్షలాది చెట్ల రూపంలో తన తల్లిని పర్యావరణంలో శాశ్వతంగా బతికించుకున్నారు.
సయాజీ షిండే నటించిన తెలుగు సినిమాలు
`ఠాగూర్`లో విలన్‌గా పరిచయం అయ్యాడు సయాజీ షిండే. `వీడే`, `ఆంధ్రావాలా`, `గుడుంబా శంకర్`, `సూపర్`, `అతడు`, `ఆంధ్రుడు`, `దేవదాసు`, `లక్ష్మి`, `పోకిరి`, `వీరభద్ర`, `నాయుడమ్మ`, `బాస్`, `రాఖీ`, `లక్ష్మీ కల్యాణం`, `దుబాయ్ శ్రీను`, `శంకర్ దాదా ఎంబీబీఎస్`, `చిరుతా`, `టక్కరి`, `కృష్ణ, `చింతకాయల రవి`, `నేనింతే`, `కింగ్`, `ఆరుంధతి`, `బంగారు బాబు`, `కిక్`, `పిస్తా` ఇలా అనేక తెలుగు సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. చివరగా ఆయన `కుబేరా`లో మెరిశారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మరాఠి, హిందీ, బోజ్‌పూరి, ఇంగ్లీష్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు సయాజీ షిండే.


