డ్రగ్స్ కేసులో మరో బిగ్ షాట్ పోలీసుల వలలో చిక్కాడు.  ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. శాండిల్ వుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఆదిత్య అల్వా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పక్కా సమాచారం మేరకు ఆదిత్య అల్వాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. నాలుగు నెలలుగా పరారీలో ఉన్న ఆదిత్య కోసం అధికారులు రెక్కీ నిర్వహిస్తున్నారు. సన్నిహితులతో మాట్లాడిన సంభాషణలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆదిత్య అల్వాను పట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు. 

ఆదిత్య అనేక డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మంది అరెస్ట్ కాగా ఆదిత్య మాత్రం పరారీలో ఉన్నాడు. అక్టోబర్ 15, 2020లో ఆదిత్య ఆల్వా అక్కగారైన ప్రియాంక ఇంటిని సి సి బి అధికారులు సోదా చేయగా, కొన్ని మాదక ద్రవ్యాలు లభించాయి. అప్పటి నుండి ఆదిత్య కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 
సోమవారం అరెస్టైన ఆదిత్యను బెంగుళూరుకు తరలించారు. బెంగుళూరులో ఆదిత్య అల్వాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. 

బాలీవుడ్ తో పాటు శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపగా... పలువురు అరెస్ట్ కావడం జరిగింది. అరెస్టైన వారిలో హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది తో పాటు బుల్లితెర, వెండితెర సెలెబ్రిటీలు ఉన్నారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన సంజనా గల్రాని బెయిల్ పై విడుదల కావడం జరిగింది. రాగిణి ద్వివేది మాత్రం ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.