ఒకప్పుడు సోను సూద్ అంటే ఓ విలన్ మంచి నటుడు. కానీ లాక్ డౌన్ వలన ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు సోనుసూద్ ఒక వ్యక్తిగా ఏమిటో నిరూపించాయి.  ఎటువంటి ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. సొంత గూటికి చేరే మార్గం లేక, తినడానికి తిండి లేక అలమటించి పోయారు. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేని కార్మికులు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న సొంత ఇంటికి చేరుకోవడానికి రోడ్లపై నడక ప్రారంభించారు. ఈ పరిస్థితి చూసిన సోనూసూద్ వేల మంది కార్మికులు సొంత ఊళ్లకు వెళ్ళడానికి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు ఏర్పాటు చేశారు. 

సోషల్ మీడియా వేదికగా అడిగిందే తడవుగా సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. పేదల కోసం కోట్ల రూపాయల సొంత డబ్భులు ఖర్చుపెట్టిన సోనూసూద్ దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. సోనూసూద్ అంటే దేవుడు అనేంతగా కొలిచే వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు. సోనూ సూద్ దానగుణం తెలిశాక ఆయన పాప్యులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. సోను సూద్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ నుండి ఘనస్వాగతం లభిస్తుంది.
 
కాగా నేడు సూను సూద్ హైదరాబాద్ వచ్చారు. ఓ షూటింగ్ లో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడం జరిగింది. మాస్క్ లో ఉన్నప్పటికీ సోను సూద్ ని గుర్తుపట్టిన అక్కడి అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.సోనూ సూద్ ఫోటోలు తీయడానికి ఫోన్ కెమెరాలకు పనిచెప్పారు. ఫ్యాన్స్ ఉత్సాహానికి అడ్డు చెప్పకుండా సోనూసూద్ సైతం వాళ్ళతో సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం తెలుగులో సోనూ సూద్ ఆచార్య మరియు అల్లుడు అదుర్స్ చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం.