సినీ స్టార్స్ అంటే  సామాన్యుల్లో ఉండే అభిమానం, ఆరాధన అలా ఇలా ఉండదు. తాము అబిమానించే హీరో,హీరోయిన్స్  కోసం కొందరు వీరాభిమానులు గుడులు కూడా కట్టిన సందర్భాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ వీరాభిమాని ఒకరు 250 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వార్తల్లో నిలిచారు. అల్లు అర్జున్ సినిమాలు, అతని వ్యక్తిత్వానికి ఫిదా అయిన ఒక ఫ్యాన్ బన్నీని కలవడానికి మాచర్ల నుంచి హైదరాబాద్  వరకు పాదయాత్ర చేపట్టినట్లు చెప్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పి.నాగేశ్వరరావు అనే యువకుడు అల్లు అర్జున్ ను గంగోత్రి సినిమా నుంచి అభిమానిస్తున్నాడు. అయితే బన్నీని కలవాలనేది అతని కోరిక. గతంలో అనేకసార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. దాంతో మాచర్ల నుంచి హైదరాబాద్ కు కాలినడకన వస్తే బన్నీ తనను గుర్తిస్తాడని నాగేశ్వరరావు భావించాడు.

అనుకున్నదే తడవుగా ఈ నెల 17న మాచర్లలో పాదయాత్ర ప్రారంభించి ఇవాళ్టికి హైదరాబాద్ చేరుకున్నాడు. చేతిలో అల్లు అర్జున్ ప్లకార్డుతో కనిపించిన ఆ యువకుడ్ని ఓ పాత్రికేయుడు పలకరించగా తన వివరాలు తెలిపాడు. తన పాదయాత్రను బన్నీ గుర్తించి కలిసే అవకాశం ఇస్తాడని భావిస్తున్నానని నాగేశ్వరరావు తెలిపాడు.