హీరో ధనుష్ `కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన వల్లే తాను ఈ స్టేజ్‌పై ఉన్నానని వెల్లడించారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగులో ఇప్పటికే `సార్` చిత్రంలో నటించి హిట్ అందుకున్నారు. ఇప్పుడు `కుబేర` చిత్రంతో రాబోతున్నారు. నాగార్జున ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఏషియన్ సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం `కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
`కుబేర` ఈవెంట్‌లో తండ్రిని గుర్తు చేసుకున్న ధనుష్
ఇందులో ధనుష్ మాట్లాడుతూ, తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. `కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనపై చేసిన ఏవీ చూసి తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఈ ఏవీలో తాను ఎంతో సాధించినట్టు చెబుతున్నారు, కానీ నా తండ్రి సాధించినదాంతో పోల్చితే ఇది పెద్ద లెక్క కాదు.
ఆయన ఎక్కడో చిన్న విలేజ్ నుంచి వచ్చారు. రైతు నుంచి జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఆయనే కారణం. ఈ ఏవీ చూస్తుంటే నాన్నే గుర్తొస్తున్నారు. ఈ సందర్భంగా ముందుగా నేను ఆయనకే థ్యాంక్స్ చెబుతాను` అని తెలిపారు ధనుష్.
శేఖర్ కమ్ముల ప్రాణం పెట్టిన చేసిన మూవీ `కుబేర`
ఇంకా మాట్లాడుతూ, `కుబేర` తనకిది తెలుగులో రెండో సినిమా అని, తమిళంలో 51వ చిత్రమని తెలిపారు. అయితే తెలుగులో చేసిన `సార్` మూవీ కంటే ముందే ఈ స్క్రిప్ట్ విన్నానని, కాకపోతే స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, షూటింగ్ చేసుకోవడానికి టైమ్ పట్టిందన్నారు. `శేఖర్ కమ్ముల ప్రాణం పెట్టి సినిమా చేశారు.
ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినా షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా అంటే ఆయనకు అంత పిచ్చి. ఆయన దర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. రాజమౌళి సార్ చెప్పారు శేఖర్ కమ్ముల స్టబ్బర్న్ అని, కానీ సరైన కారణం కోసం ఆయన స్టబ్బర్న్ కాద`న్నారు ధనుష్.
మా చెల్లికి నాగార్జున సార్ అంటే పెద్ద క్రష్
నాగార్జునతో వర్క్ చేయడం గురించి చెబుతూ, నాగార్జున సార్‌తో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అని, ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినట్టు తెలిపారు.
తన సిస్టర్స్ కి చిన్నప్పుడు నాగార్జున అంటే క్రష్ అని, పడి చచ్చేవాళ్లు అని తెలిపారు. నాగార్జున సార్ నటుడిగానే కాదు, వ్యక్తిగానూ ఫెంటాస్టిక్ పర్సన్ అని, ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు ధనుష్.
లక్ వల్లే రష్మిక ఈ స్థాయికి రాలేదు, కష్టపడి వచ్చింది
హీరోయిన్ రష్మిక మందన్నా గురించి చెబుతూ, రష్మికని అంతా వెయ్యి కోట్ల స్టార్, రెండు వేల కోట్ల హీరోయిన్ అని, నేషనల్ క్రష్ అని, లక్కీ హీరోయిన్ అని అంటుంటారు. కానీ ఇదంతా ఆమె నిర్మించుకున్న కోట అని, తన కష్టంతో, ఎంతో హార్డ్ వర్క్ తో ఈ స్థాయికి వచ్చిందని, చిన్న అమ్మాయిగా ప్రారంభమై, ఇప్పుడు నేషనల్ స్టార్‌గా ఎదిగిందని, ఇందులో పూర్తిగా ఆమె కష్టమే ఉందన్నారు.
ఆ కష్టంతోనే ఇదంతా సాధించిందని, వెయ్యి కోట్లు, రెండువేల కోట్లు ఆమె కష్టఫలితమే అని తెలిపారు. ఆమెతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిలపై ప్రశంసలు కురిపించారు. సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్లకి థ్యాంక్స్ చెప్పారు ధనుష్. అయితే ఆయన అభిమానులు ధనుష్‌ని పెద్ద గజ మాలతో సత్కరించడం విశేషం.