Shreya Ghoshal: స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత, ఇప్పుడు శ్రేయా ఘోషల్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తనకు కూడా విరామం తీసుకోవాలనిపిస్తుందని, స్టేజ్‌పై లిప్ సింక్ చేయాల్సి వస్తే ఆ రోజే పాడటం ఆపేస్తానని స్పష్టం చేశారు.
అరిజిత్ సింగ్ తర్వాత శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ సంగీత ప్రపంచంలో ఇప్పుడు విరామం మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే స్టార్ సింగర్ అరిజిత్ సింగ్.. సినిమాల్లో పాడటానికి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఆయన బాటలోనే, భారత నైటింగేల్ శ్రేయా ఘోషల్ కూడా తన మనసులోని మాట బయటపెట్టారు. ఆమె వ్యాఖ్యలు మ్యూజిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
నాకు కూడా బ్రేక్ కావాలనిపిస్తుంది
ఇటీవల 'ఏబీపీ న్యూస్'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ, అరిజిత్ సింగ్ నిర్ణయాన్ని ఆమె అభినందించారు. `నిజం చెప్పాలంటే, కొన్నిసార్లు నాకు కూడా ఈ పని నుంచి బ్రేక్ తీసుకోవాలని అనిపిస్తుంది. అరిజిత్ చాలా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను` అని శ్రేయా తెలిపారు.
అరిజిత్ గురించి మాట్లాడుతూ.. `అతను మనసు పెట్టి పాడే సంగీతకారుడు. సంగీతం వల్ల తనకేం వస్తుంది, నేనీ పని ఎందుకు చేస్తున్నా అని ఆలోచించడు. తనకు సంతోషాన్నిచ్చే పనే చేస్తాడు. తనకంటే సంగీతమే గొప్పదని నమ్ముతాడు, అందుకే ప్రజలు అతడిని అంతగా ప్రేమిస్తారు,` అని ప్రశంసించారు.
లిప్-సింక్ చేయాల్సి వస్తే.. పాడటమే మానేస్తా!
ఇదే సమయంలో లైవ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ శ్రేయా ఘోషల్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్టేజ్‌పై పాటలకు కేవలం పెదాలు కదపడాన్ని (లిప్-సింక్) ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. "స్టేజ్‌పై లిప్-సింక్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా, అవమానంగా ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, నేను లిప్-సింక్ చేయాల్సిన రోజు వస్తే, ఆ రోజే నేను పాడటం మానేస్తాను` అని శ్రేయా ఘోషల్ తేల్చి చెప్పారు.
`నా గొంతు పలికినంత కాలం, నా రియాజ్ (సాధన) సాగినంత కాలం నేను స్టేజ్‌పై లైవ్‌గానే పాడాలనుకుంటాను. ప్రేక్షకులు మన కోసం వస్తారు, వాళ్లను మోసం చేయడం నాకు ఇష్టం లేదు` అంటూ తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.
కళాకారుల బాధ్యత పెద్దది
లైవ్ షోల సమయంలో కళాకారులు ఎదుర్కొనే ఒత్తిడి గురించి కూడా శ్రేయా మాట్లాడారు. "ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న మాకు వ్యక్తిగతంగా ఎన్ని బాధలున్నా, అవి స్టేజ్‌పై కనిపించకూడదు. ప్రజలు మన దగ్గరికి వచ్చేది సంగీతం కోసం, స్ఫూర్తి కోసం. సంగీతం వాళ్ల బాధలను మరిపించి, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రేక్షకుల చప్పట్లు, ప్రేమే మాకు అసలైన బలం. మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఆ శక్తి దానంతట అదే వస్తుంది` అని ఆమె వివరించారు.
మొత్తం మీద, అరిజిత్ సింగ్ బాటలోనే శ్రేయా ఘోషల్ కూడా విరామం గురించి హింట్ ఇవ్వడం అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగించినా, సంగీతం పట్ల ఆమెకున్న నిబద్ధత అందరి ప్రశంసలు అందుకుంటోంది.


