బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కీలక మలుపులు తిరుగుతోంది. ఆయన డెత్ మిస్టరీని తేల్చే క్రమంలో.. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులు బుక్ అయ్యింది. ఆమె శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు కూడా బయటపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్సీబీ అధికారులు వారికి సమన్లు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు కూడా వినిపిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది. 

జయ వాట్సాప్‌ చాట్‌ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్‌ భాషలో ‘డీ’ అంటే దీపిక అని, ‘కే’ అంటే కరిష్మా అని అనుమానిస్తున్నారు. ఎన్‌సీబీ దీపికా మేనేజర్‌ కరిష్మాకు సమన్లు జారీ చేసింది. జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి నిర్మాత మధు మంతెనకు కూడా సమన్లు జారీ చేసింది. 

డ్రగ్స్‌ కేసు విచారణలో ఇప్పుడు రియాతో పాటు జయా సాహా కూడా అత్యంత కీలకంగా మారారు. దీపిక, శ్రద్ధాకపూర్‌లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. వీరితో పాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబాటాలకు ఈ వారంలో సమన్లు జారీ చేయనున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా చెప్పారు.