ఈ ఆదివారం ప్రారంభమైన తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఎప్పటిలాగే ఈ షోపై వివాదాలు  మొదలయ్యాయి. హీరో అక్కినేని నాగార్జున యాంకర్ గా చేస్తున్న ఈ షోపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మనదేశ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నారని.. శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని.. బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

యువతీ యువకులను 100 రోజుల పాటు ఇంట్లో  పెట్టి సమాజానికి ఎలాంటి సందేశమిస్తున్నారని విరుచుకుపడ్డారు. కళామతల్లికి అన్యాయం చేస్తూ.. సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు నారాయణ. అభిజిత్ ను నాగార్జున ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్ అనడంపై నారాయణ మండిపడ్డారు.  ఆయన మాటల్లోనే...

బిగ్ బాస్ షో వైభవంగా ప్రారంభమైంది. హిమాలయాల్లో ఉన్న సంస్కృతిని తీసుకొచ్చి మురికి కుంటలో పడిసినట్లుంది. విజయ్ మాల్యా ఎంతటి విలాస జీవితం గడిపారో అంతకు మించిన భవనాలను ఏర్పాటు చేశారు. యువతీ యువకులను 100 రోజుల పాటు లోపల పెడతారట. ఓ యువకుడి ముందు ముగ్గురు హీరోయిన్ల ఫొటోలు ఉంచి నాగార్జున పలు ప్రశ్నలు అడిగాడు. ఒక అమ్మాయిని ముద్దుపెట్టుకుంటా.. ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అతడు చెబితే నాగార్జున ఆనందపడ్డాడు. ఇదా మీరిచ్చే సందేశం.  కళామతల్లికి అన్యాయం చేస్తున్నారు. కోట్లాది మందిని టీవీల ముందు కూర్చోబెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతున్నారు. దీన్ని ఖండిస్తున్నాం.
— నారాయణ

ఇక ఈ షోలో మొత్తం 16 మంది సభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టగా.. వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ మోనాల్ గజ్జర్, యాంకర్ లాస్య, జర్నలిస్టులు దేవినాగవల్లి, సుజాత, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక, దివి, అరియానా గ్లోరీ, నటి కరాటే కళ్యాణి, గంగవ్వ, కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్, ర్యాప్ సింగర్ నోయెల్, దర్శకుడు సూర్య కిరణ్, నటుడు అభిజిత్, సయ్యద్ సోహైల్, అఖిల్ సార్థక్, మెహబూబా దిల్సే బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌గా ఉన్నారు.