బెట్టింగ్‌ యాప్స్ కేసు మరింత సీరియస్‌గా మారుతుంది. తాజాగా విజయ్‌ దేవరకొండ, రానా, ప్రకాష్‌ రాజ్‌, మంచు లక్ష్మీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. 

DID YOU
KNOW
?
బాలనటుడిగా విజయ్‌
విజయ్‌ దేవరకొండ చిన్నప్పుడు షిర్డిసాయిపై రూపొందిన `షిర్డిసాయి పర్తిసాయి దివ్య కథ` అనే సీరియల్‌ బాలనటుడిగా నటించడం విశేషం.

అక్రమ బెట్టింగ్‌ యాప్స్ ని ప్రమోట్ చేసిన కేసు ఇప్పుడు టాలీవుడ్‌ని వెంటాడుతోంది. ఈ యాప్‌లను ప్రమోట్‌ చేసిన హీరోలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌) సీరియస్‌గా తీసుకుంది. 

ఈ క్రమంలో తాజాగా ఈ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఇరుక్కున్న విజయ్‌ దేవరకొండ, రానా, ప్రకాష్‌ రాజ్‌, మంచు లక్ష్మీలకు నోటీసులు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ ఈ మేరకు సోమవారం సమన్లు జారీ చేసింది.

విజయ్‌ దేవరకొండ, ప్రకాష్‌ రాజ్‌, రానా, మంచు లక్ష్మీలు ఈడీ ముందు హాజరయ్యే డేట్లు 

ఈడీ జారీ చేసిన సమన్లలో ఒక్కో స్టార్‌కి ఒక్కో డేట్‌ని ఫిక్స్ చేసింది. ముందుగా రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన జులై 23న ఈడీ ముందు హాజరు కావాలని తెలిపింది. ఆ తర్వాత జులై 30న ప్రకాష్‌ రాజ్‌ అటెండ్‌ కావాల్సి ఉంది. 

మరోవైపు విజయ్‌ దేవరకొండ ఆగస్ట్ 6న ఈడీ ముందు హాజరు కావాలి. మంచు లక్ష్మీ ఆగస్ట్ 13న హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

అక్రమ బెట్టింగ్‌ యాప్‌ కేసులో 29 మంది సెలబ్రిటీలు 

ఈ అక్రమ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్ కి సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఇన్‌ఫోర్స్ మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్ నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం. 

ఇందులో కేసులు నమోదైన వారిలో విజయ్‌ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీతోపాటు నిధి అగర్వాల్‌, శ్రీముఖి, శ్యామల, ప్రణీత, రీతూ చౌదరీ, అనన్య నాగళ్ల, విష్ణు ప్రియా, సిరి హన్మంతు, వర్షిణి, వసంత కృష్ణ, టేస్టీ తేజ వంటి వారు కూడా ఉన్నారు. 

అలాగే ఇన్‌ఫ్లూయెన్సర్లలో హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌ బాయ్‌ నాని వంటి వారు ఉన్నారు. మరి వీరి విచారణ ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.

బెట్టింగ్‌ యాప్‌ కేసులను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం 

అక్రమంగా వాడే బెట్టింగ్‌ యాప్ వల్ల అమాయక జనాలు నష్టపోతున్నారని, ఆ ఊబిలోపడి ఆర్థికంగా దెబ్బతింటున్నారని, కొందరు అప్పులపాలు అయి ప్రాణాలు విడిచే స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం,  ఐపీఎస్‌ సజ్ఞనార్‌ ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఈ బెట్టింగ్‌ యాప్ బాగోతం బయటకు వచ్చింది. ఇందులో సినిమా సెలబ్రిటీలు కూడా ఇన్‌ వాల్వ్ కావడం, కొన్ని బెట్టింగ్‌ యాప్‌లను వీరు ప్రమోట్‌ చేయడంతో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్లింది.