శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్సిబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న వీరేన్ ఖన్నా అధికారుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తుంది. దీనితో అధికారులు ఆయనకు నార్కోటిక్ టెస్ట్స్ చేయాలని నిర్ణయించారు. దీని కోసం కోర్టు అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. నార్కోటిక్ టెస్ట్స్ కొరకు వీరేన్ ఖన్నాను హైదరాబాద్ లేదా అహ్మదాబాద్ తీసుకెళ్లాలనేది అధికారుల ఆలోచనగా తెలుస్తుంది. 

డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలపై మరింత లోతుగా విచారణ సాగుతుంది. విదేశీ డ్రగ్ పెడ్లర్స్ దగ్గర వీరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు అధికారులు సేకరించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన సంజనా, రాగిణి ఫార్మ్ హౌస్ లో వాటితో పార్టీలలో పాల్గొనేవారని అధికారులు నిర్ధారించారు. దీనితో ఈ కేసులో సంజనా, రాగిణి ద్వివేది మరింతగా ఇరుక్కునే సూచనలు కనిపిస్తున్నాయి. 

కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ అనుశ్రీ సోషల్ మీడియా వేదికగా ఆవేదనకు గురయ్యారు.  డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలియజేశారు. ఓ వీడియో సందేశం ద్వారా అనుశ్రీ తాను నిర్దోషిని అన్నారు. ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నంత మాత్రాన తాను డ్రగ్స్ కేసులో నేరస్థురాలిని కానని అన్నారు.ఈ విషయంలో నాకు తెలిసిన సమాచారం అధికారులకు తెలియజేశాను అన్నారు.  డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో యాంకర్ అనుశ్రీని అధికారులు విచారించడం జరిగింది.