అమితాబ్ బచ్చన్ ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని నటుడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఎందరు నటులు వచ్చినా అమితాబ్ కంటూ సినిమా రంగంలో ప్రత్యేక స్థానం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా అమితాబ్ బచ్చన్ కెరీర్ లోనే ఓ పీడకల లాంటి సంఘటన 1982లో జరిగింది. 

అమితాబ్ బచ్చన్, రతి అగ్నిహోత్రి జంటగా నటించిన కూలి చిత్రం ఆ ఏడాదే చిత్రీకరణ జరుపుకుంది. ఆ చిత్ర షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఓ స్టంట్ సీన్ లో నటిస్తున్న సమయంలో కొన్ని అడుగుల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు టేబుల్ అంచున పడ్డారు. బెంగుళూరులో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. 

అమితాబ్ వెంటనే స్పృహ కూడా కోల్పోయారంటే ఎంతలా గాయపడ్డారో అర్థం చేసుకోవచ్చు. చిత్ర యూనిట్ వెంటనే అమితాబ్ ని బెంగుళూరులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత ముంబైలోని మరో ఆసుపత్రికి తరలించారు. రెండు నెలలపాటు అమితాబ్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 

రెండు నెలల తర్వాతే అమితాబ్ ఇంటికి తిరిగి వచ్చారు. అమితాబ్ ఇంటికి వస్తున్న అప్పటి వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమితాబ్ అంబాసిడర్ కారు నుంచి దిగిన వెంటనే తన తండ్రి పాదాలకు నమస్కరించారు. 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నా కోసం ప్రార్థించిన వారందరికీ రుణపడి ఉంటాను. మీ అంచనాలు అందుకునేందుకు నిత్యం కష్టపడి పనిచేస్తూనే ఉంటా అని అమితాబ్ పేర్కొన్నారు. ఓ అభిమాని షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.