సీనియర్ నటుడు, రాజకీయవేత్త విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతూ ఉండగా డీఎండీకే పార్టీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలలో ఎంత మాత్రం నిజం లేదని వివరించారు.  తాజా ప్రకటనతో విజయ్ కాంత్  ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్న ఆయన ఫ్యాన్స్ ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. 

గత నెల 22న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు కొవిడ్‌-19 సోకిందని తేల్చారు. అనంతరం చికిత్స తీసుకున్న విజయకాంత్‌ కోలుకున్నాక ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న సాయంత్రం ఆయన మరోసారి అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. 

కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వదంతులు వస్తున్నాయి. దీంతో డీఎండీకే పార్టీ దీనిపై ప్రకటన చేసింది. విజయకాంత్  ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని, సామాజిక మాధ్యమాల్లో ఆయన గురించి వస్తోన్న వార్తలను నమ్మవద్దని చెప్పింది.