సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది నటి రష్మిక. కానీ సినిమాలో ఆ పాత్రకు జనాలు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. పైగా రష్మిక క్యారెక్టర్ ని బాగా ట్రోల్ చేశారు.

రష్మిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం, హీరోయిన్ తో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించడంతో రష్మిక నటన గురించి, ఆమె పాత్ర గురించి నెటిజన్లు చాలా తక్కువ చేసి మాట్లాడారు. తన కొత్త సినిమా 'భీష్మ' ప్రమోషన్స్ లో భాగంగా మీడియాని కలిసిన రష్మిక వద్ద 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రస్తావన తీసుకురాగా.. తన పాత్ర గురించి జనాలు విమర్శించారా..? అంటూ ఆశ్చర్యపోయింది.

సినిమాలో తన పాత్ర గురించి విమర్శలు వచ్చాయనే సంగతి తనకు తెలియదని.. అవేవీ వినలేదని.. అయితే ఆ సినిమాలో తన పాత్రకు తగ్గట్లు కొన్ని చోట్ల ఓవర్ రియాక్ట్ అవ్వాలని.. అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన గురించి విమర్శలు వచ్చాయంటే తనకేమీ బాధ లేదని.. విమర్శలు ఇంకా ఎదగడానికి ఉపయోగపతాయని.. వాటిని అంగీకరిస్తానని.. తరువాతి సినిమాల్లో ఇంకొంచెం జాగ్రత్త పడతానని చెప్పింది.

ఇక తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ దక్కించుకోవడం తన అదృష్టం కాదని.. మంచి స్క్రిప్ట్ ని ఎన్నుకోవడం, పాత్రకు తగ్గట్లు కష్టపడి పని చేయడం వలనే స్టార్ ఇమేజ్ పొందగాలిగానని.. ఇవన్నీ లక్ వల్ల రావని చెప్పుకొచ్చింది. హార్డ్ వర్క్ వలనే తను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది.