కర్నూల్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఇది విజృంభిస్తుందో అని ప్రజలందరూ ఓవైపు వణికిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కఠిన నిబంధనలను విధిస్తున్నాయి. మనిషికి మనిషికి ఒక మీటరు దూరం పాటించాలని గుంపులు గుంపులుగా ఉండకూడదని... ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ కూడా ఇప్పటికే లాక్ డౌన్  ప్రకటించింది. ఈ నిబంధనలను లెక్కచేయకుండా కర్నూలు జిల్లా పత్తికొండలోని  ఓ షాదీ ఖాన్ లో ముస్లిం పెద్దలు వివాహ విందును యదేచ్చగా నిర్వహించారు.. 

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని ముస్లిం వీధికి చెందిన ఓ యువకుడికి డోన్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ నెల 22న వివాహం జరిగింది. ఈక్రమంలో మంగళవారం పత్తికొండ షాదీఖాన్ లో వీరి వివాహ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. కేవలం అతి తక్కువమంది అతిథులతో వివాహం జరుపుకోడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ ఇలా విందులు, వినోదాలు జరపుకోడానికి  ఎలాంటి అనుమతి లేదు. 

దీంతో ఈ విందు గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా వధూవరుల బంధువులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పత్తికొండ పోలీసులు వివాహ రిసెప్షన్ ను నిలిపివేశారు. 

వధూవరుల పెద్దలను పిలిచి కరోనా పై ఎన్ని ఆంక్షలు ఉన్నా కూడా ఇలా రిసెప్షన్ చేసుకోవడంపై గట్టిగా హెచ్చరించారు. వధూవరుల బంధు మిత్రులు అందర్నీ గుంపులు గుంపులుగా ఉండకుండా అక్కడి నుండి అందరిని పంపించాడు. కరోనా పై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు ఏమాత్రం లెక్కచేయకుండా ఈ విధంగా విందు ఏర్పాటుచేసిన పెళ్లిపెద్దలను హెచ్చరించారు. 

ఇలా పోలీసులు రంగప్రవేశం చేయడంతో పెళ్లి రిసెప్షన్ ఆగిపోయింది. అరగంటలో  వధూవరుల బంధువులు షాదిఖానాను ఖాళీ చేశారు. ఇంకెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పత్తికొండ పోలీసులు పట్టణ ప్రజలకు హెచ్చరించారు.