అమరావతి: రాష్ట్రంలో ఆసుపత్రి ప్రసవాలను పెంపొందించుట ద్వారా మాతాశిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు అవసమరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ... మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించేందుకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పారు. ముఖ్యంగా మాతాశిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఆసుపత్రి ప్రసవాలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని... ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. 

అదేవిధంగా మురికివాడల ప్రజలకు పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సిఎస్ ఆదేశించారు. ఇటీవల కాలంలో నియమించబడిన పట్టణ వార్డు ఎన్ఎంల సేవలను పూర్తిగా వినియోగించుకుని ప్రజలకు మంచి వైద్యసేవలు అందేలా చూడాలని చెప్పారు. 

ప్రైమరీ హెల్త్ కేర్ పై ప్రత్యేక దృష్టిపెట్టి ఇటీవల గ్రామ,వార్డు సచివాలయాల్లో నియమించిన వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను పూర్తిగా వినియోగించి ప్రజలందరికీ మెరుగైన  వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ వైద్య అరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

read more పార్టీ మార్పుపై జేసి ఫ్యామిలీ క్లారిటీ... ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డిల కామెంట్స్

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి  జవహర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో త్వరలో మండలానికొక 108, 104 అంబులెన్సులను అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని దానిపై అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ కు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్సులు 439 పనిచేస్తున్నాయని, 108 మెబైల్ మెడికల్ యూనిట్లకు సంబంధించి 293 పనిచేస్తున్నాయని తెలిపారు.

అంతకు ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన కార్యక్రమాలు తదితర వివరాలను వివరించారు. ప్రైమరీ హెల్తుకేర్ లో భాగంగా అక్టోబరు 30నాటికి ఒపి(ఔట్ పేషెంట్)కింద 2కోట్ల 44లక్షల 83వేల మందికి వివిధ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించామని తెలిపారు.అలాగే 6లక్షల 88వేల 945 మందికి ఇన్ పేషంట కింద సేవలందించినట్టు పేర్కొన్నారు.

31వేల 668 ఆసుపత్రి ప్రసవాలు జరిగాయని, 90లక్షల 69వేల 43 ల్యాబ్ టెస్టులు నిర్వహించడంతో పాటు 96వేల 495 వివిధ రకాల సర్జరీలు నిర్వహించడం జరిగిందని చెప్పారు.  రాష్ట్రంలో 7వేల 458 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా వాటిలో 1145 కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దగ్గరలోనే ఉన్నాయని వాటిలో 779 కేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. 

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటన్నిటినీ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంత పిహెచ్సిల్లో 19 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు, గిరిజన ప్రాంత పిహెచ్ సీల్లో 23 రకాల డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహిస్తూ 196 రకాల మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని కమీషనర్ కార్తికేయ మిశ్రా వివరించారు. 

read more  ఏపీ అసెంబ్లీ సమావేశాలు: బుగ్గ‌న లెక్క‌ల‌తో విప‌క్షం చిత్తు

అదే విధంగా గత నవంబరు 7వతేదీ నుండి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో టెలీమెడిసిన్ హబ్ లను ఏర్పాటు చేసి సేవలందించడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో మరో 300 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా టెలీమెడిసన్ సేవలను అందించేందుక చర్యల తీసుకుంటున్నట్టు చెప్పారు. 

ఇంకా ఈసమావేశంలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వివిధ కార్యక్రమాలు, పథకాలు,ఆసుపత్రుల పనితీరును ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
 ఈ సమావేశంలో ఎపిహెచ్ఎంఐడిసి ఎండి వి.విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సిఇఓ మల్లికార్జున్, ఎపివైద్య విధాన పరిషత్ ఇన్చార్జి కమీషనర్ డా.రామకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డా.అరుణ కుమారి, ఎపి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.