ఏపీ అసెంబ్లీ సమావేశాలు: బుగ్గన లెక్కలతో విపక్షం చిత్తు
చంద్రబాబు అండ్ కో శవ రాజకీయం మానుకోవాలని మంత్రి కొడాలి నాని టీడీపీని హెచ్చరించారు. ఉల్లి కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతు మరణించాడని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పికొట్టారు.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గత పాలన టార్గెట్‌గా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెలరేగిపోయాడు. కార్పొరేషన్‌ల వారీగా పాత లెక్కలను బయటకు తీసి చంద్రబాబు, టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అసలే 23 ఎమ్మెల్యేలతో ముక్కుతూ మూలుగుతున్నటీడీపీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూపంలో షాక్ తగిలింది. వంశీ స్పీచ్ తోనే అసెంబ్లీ మొదలుకావడంతో చంద్రబాబు సహా టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వంశీకి మైకు ఇవ్వద్దని స్పీకర్‌ను చాలా సేపు వారించడంతో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వంటి వారు కలుగజేసుకుని చంద్రబాబుకు వాగ్భాణాలు సంధించారు. చివరికి చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌ను నిండా ముంచేశారని మాజీ ముఖ్యమంత్రిపై బుగ్గన ధ్వజమెత్తారు. 2014-15న విభజన సమయంలో రూ. 6 వేల కోట్లతో ఉన్న కార్పొరేషన్.. అయిదేళ్లు గడిచి 2018-19 నాటికి రూ. 20 వేల కోట్ల అప్పుల్లో ముంచారని ధ్వజమెత్తారు. అయిదేళ్లలో రూ. 13,500 కోట్లు అప్పులు చేసిన బాబుకి సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత లేదని వివరించారు. కార్పొరేషన్ నిధులను దారిమళ్లించి చంద్రన్న కానుకలు, పసుపు కుంకుమకు వాడుకున్నారని లెక్కలు బయటకు తీశారు.
రెండో రోజు కూడా ఉల్లి ధరల పెంపుపై విపక్షం ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రయత్నించినా ప్రభుత్వం మాత్రం గట్టిగానే బదులిచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉల్లి సబ్సిడీ ధరలు, ఇప్పటి వరకు మొత్తం ఉల్లి ఎంత పంపిణీ చేశారో సభకు తెలిపారు. దేశంలోనే రూ.25లకు కేజీ ఉల్లిని అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అన్నారు.
చంద్రబాబు అండ్ కో శవ రాజకీయం మానుకోవాలని మంత్రి కొడాలి నాని టీడీపీని హెచ్చరించారు. ఉల్లి కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతు మరణించాడని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పికొట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను అసెంబ్లీలో సభ్యులందరి ముందూ ప్రదర్శించారు.
ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి నవ్వులు పూయించారు. హెరిటేజ్ మీద చంద్రబాబు విసిరిన సవాల్‌ను వైసీపీ లైట్ తీసుకున్నట్టు కనిపించినా గంట వ్యవధిలోనే బుగ్గన ఇంగ్లిష్ పేపర్‌లో హెరిటేజ్ షేర్ల గురించి వచ్చిన వార్తను చదివి వినిపించి రూ. 290 కోట్లకు 3.5 శాతం షేర్లు కొనుగోలు చేశారని నిరూపించారు. హెరిటేజ్‌ని ఫ్యూచర్ గ్రూప్‌కి అమ్మేశాం.. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న చంద్రబాబు ముఖం తెల్లబోయింది.