టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత విరాట్ కొహ్లీలో కొత్తగా కనిపించిన ఆనందం గురించి దినేష్ కార్తీక్ వెల్లడించారు. కుటుంబంతో సమయం గడుపుతూ, ఆటను ఆస్వాదిస్తూ, ఆర్సిబికి ఐపిఎల్ లో విజయాన్ని తెచ్చిపెట్టడంపై దృష్టి సారించాడన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ నెల ప్రారంభంలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కొహ్లీ ప్రస్తుత జీవితం ఆనందంగా సాగుతుందన్నారు. 36 ఏళ్ల కోహ్లీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని దినేష్ అన్నారు. 

తనకు అత్యంత ఇష్టమైన ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ప్రకటించారు. రోహిత్ శర్మ రెడ్-బాల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన కొద్ది రోజులకే విరాట్ ఈ ప్రకటన చేశారు. ఈ ఇద్దరి నిర్ణయం వల్ల ఇంగ్లాండ్‌ తో టెస్ట్ సిరీస్ టీం ఎంపిక డైలమాగా మారింది.   

విరాట్ సంతోషంగా ఉన్నాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్లో మంచి ఫామ్ లో కనిపిస్తున్న బెంగళూరు జట్టుతో విరాట్ ఉన్నారు. విరాట్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న కార్తీక్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 36 ఏళ్ల విరాట్ ఆటను ఆస్వాదిస్తున్నారని వెల్లడించారు. 

"బయటి ప్రపంచానికి ఇది షాక్‌గా ఉండొచ్చు… కానీ విరాట్ ఏం చేస్తున్నాడో మేము గమనిస్తున్నాం. అతను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, అతను ఆటను ఆస్వాదిస్తున్నాడు, తన కుటుంబంతో సమయం గడపాలని నిజంగా కోరుకుంటున్నాడు. ఇది వ్యక్తిగత నిర్ణయం, మేము దానిని గౌరవిస్తాము'' అని దినేష్ పేర్కొన్నారు.

 ‘’ఎంతో ఇష్టమైన టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ బాధలో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే అతను సంతోషంగా ఉండటం, మేము ఆడమన్నప్పుడల్లా సిద్ధంగా ఉండటం చూసి చాలా సంతోషంగా ఉంది. అతన్ని మంచి స్ఫూర్తితో ఉంచడమే ముఖ్యం" అని కార్తీక్ అన్నారు. 

విరాట్ కోహ్లీ టెస్ట్ ప్రయాణం

విరాట్ 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం భారతదేశాన్ని ఈ ఫార్మాట్ లో బలంగా మార్చింది. యువత, అనుభవంతో నిండిన జట్టులోకి దూకుడు, ఫిట్‌నెస్ సంస్కృతిని అతను నింపాడు. అతడు టెస్ట్ కెరీర్‌ లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో భారతదేశం తరపున నాల్గవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.