అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతూనే అద్భుతం సృష్టించిన టీమిండియా యువ బౌలర్ నవదీప్ సైనీపై ఐసిసి షాకిచ్చింది. వెస్టిండిస్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ద్వారా సైనీకి మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన మొదటి  ఓవర్లోనే నికోలస్ పూరన్ వికెట్ పడగొట్టాడు. ఇలా తన కెరీర్లో మొదటి వికెట్ ను సాధించిన ఆనందంలో అతడు కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు.  దీంతో ఐసిసి అతడిపై చర్యలు తీసుకుంది.

పూరన్ ను ఔట్ చేసిన తర్వాత సైనీ సంబరాలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే  ఔటైన బ్యాట్ మెన్ ను ఉద్దేశించి సంజ్ఞలు చేస్తూ అతడు కాస్త దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అంపైర్లు సైనీని మైదానంలోనే హెచ్చరించడంతో పాటు మ్యాచ్ రిఫరీకి  ఫిర్యాదు చేశారు. 

అంపైర్ల ఫిర్యాదుతో విచారణ జరిపిన రిఫరీ  కూడా సైనీ ఐసిసి నిబంధనలను ఉళ్లంఘించినట్లు గుర్తించాడు. ఐసిసి నిబంధన 2.5ని అతడు అతిక్రమించినట్లు తెలిపాడు. అయితే చేసిన తప్పును సైనీ ఒప్పుకోవడంతో గట్టిగా హెచ్చరించి ఒక డీమెరిట్ పాయింట్ ను అతడి ఖాతాలో చేర్చినట్లు రిఫరీ వెల్లడించాడు.   

మొదటి టీ20లో విండీస్ టాప్ ఆర్డర్ ను కూల్చడంద్వారా నవదీప్ సైనీ మాయ చేశాడు. సైనీ తన అంతర్జాతీయ కెరీర్లో వేసిన మొదటి ఓవర్లోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ అవకాశాన్ని పొందాడు. అయితే ఈ అవకాశం కొద్దిలో మిస్సయింది. అలాగే చివరి ఓవర్ ను మెయిడెన్ గా పూర్తిచేయడమే  కాదు పొలార్డ్(49 పరుగులు) వికెట్ పడగొట్టి హాఫ్ సెంచరీని అడ్డకున్నాడు. అలా అతడు విజృంభించి 4 ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో సైనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను గ్రాండ్ గా ఆరంభించాడు. 

అతడితో పాటు భువనేశ్వర్ 2, వాషింగ్టన్ సుందర్, పాండ్యా, జడేజా, ఖలీల్ అహ్మద్ లు తలో వికెట్ పడగొట్టారు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగుల వద్దే ఆగిపోయింది. 96 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 2  ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. 

సంబంధిత వార్తలు

భారత మాజీలతో కలుపుకుంటే...సైనీ ఖాతాలో మూడు కాదు ఐదు వికెట్లు: గంభీర్ సైటైర్లు

ఆరంగేట్ర మ్యాచ్ లోనే సైనీ అదుర్స్... విండీస్ పై టీమిండియా ఘన విజయం