టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న టీ20 సీరిస్ లో టీమిండియాలో యువరక్తం ప్రవహిస్తోంది. అయితే వారు కూడా తమపై సెలెక్టర్లు వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. ఇలా తాను ఆరంగేట్రం చేసిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లోనే యువ కిలాడీ నవవదీప్ సైనీ అదరగొట్టిన విషయం తెలిసిందే. మొదటి టీ20 లో మూడు వికెట్లతో పడగొట్టి సత్తా చాటిన ఈ డిల్లీ కుర్రాడిపై ప్రశంసల  వర్షం కురుస్తోంది. అయితే మాజీ టీమిండియా ప్లేయర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ మాత్రం సైనీని ప్రశంసిస్తూనే అతన్ని అణగదొక్కడానికి ప్రయత్నించారంటూ కొందరిపై ఘాటు విమర్శలు చేశాడు. 

గంభీర్ ట్విట్టర్ ద్వారా టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ బిషప్ సింగ్ బేడీతో పాటు చేతన్ చౌహాన్ లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరు తమవారి కోసం సైనీని  ఎదగనివ్వకుండా అడ్డకున్నారని ఆరోపించాడు. ఇలాంటి వారు సృష్టించిన అడ్డంకులను దాటుకుని ఇక్కడివరకు చేరుకున్న సైనీని ఎంత పొగిడినా తక్కువేనని గంభీర్ అభినందించాడు. 

''నవదీప్ సైనీ...నువ్వు ఆరంగేట్ర మ్యాచ్ లోనే అదరగొట్టావు. అయితే అంతకంటే ముందే నువ్వు మరో రెండు వికట్లు  కూడా పడగొట్టావ్. అంతర్జాతీయ క్రికెట్ లో నీవు తీసిన మొదటి రెండు వికెట్లలో ఒకటి బిషప్ సింగ్ బేడిది కాగా  ఇంకోటి చేతన్ చౌహాన్ ది. వీరిద్దరి మిడిల్ వికెట్లను ఎగరగొట్టి మరీ నువ్వు సత్తా చాటావు.  ఇలా టీమిండియా  ఆటగాడిగా నువ్వు మైదానంలో అడుగుపెట్టక ముందే ఈ  ఘనత సాధించావు. వారికిది సిగ్గుచేటు.'' అంటూ బేడీ,చౌహాన్ లపై గంభీర్ లపై సెటైర్లు వేశాడు. 

 

గంభీర్ వ్యాఖ్యలపై బిషప్ సింగ్ స్పందిస్తూ... ''అతడి గురించి నేనేమీ మాట్లాడను. కానీ సైనీని అడ్డుకునే ప్రయత్నం తానెప్పుడు చేయలేదు. ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా గంభీర్ ఇంకా మారనట్లున్నాడు.'' అని అన్నాడు. 

బేడీ  వ్యాఖ్యలతో చిర్రెత్తిపోయిన గంభీర్ సైనీని ఎలా అణగదొక్కడానికి ప్రయత్నించాడో వివరించాడు. '' అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అనర్హుడైన కొడుకు కోసం బిషప్ సింగ్ సైనీని అడ్డుకున్నాడు. డిడిసిఎ  టీంలో తన మేనల్లుడిని  ఆడించడానికి చేతన్ చౌహాన్ కూడా సైనీకి ద్రోహం  చేశాడు. అలా 2013 లో నవదీప్ సైనీకి వ్యతిరేకంగా బేడీ లెటర్ రాయలేదా...?'' అని పేర్కొంటూ అందుకు సంబంధించిన వార్తను గంభీర్ ఈ ట్వీట్  కు జతచేశాడు.