Asianet News TeluguAsianet News Telugu

SRH vs PBKS : అభిషేక్-క్లాసెన్ సూప‌ర్ ఇన్నింగ్స్.. పంజాబ్ చిత్తు.. సెకండ్ ప్లేస్ లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్

SRH vs PBKS Highlights : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్ర‌యాత్ర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ త్వ‌ర‌గానే ఔట్ అయిన‌ప్ప‌టికీ అభిషేక్ శ‌ర్మ‌, హెన్రిచ్ క్లాసెన్ లు త‌మ అద్భుత‌మైన ఆట‌తో హైద‌రాబాద్ కు మ‌రో విజ‌యాన్ని అందించారు.

SRH vs PBKS : Abhishek-Klaasen super innings.. Punjab's defeat; Sunrisers Hyderabad climb to second spot in IPL 2024 points table  RMA
Author
First Published May 19, 2024, 8:23 PM IST

SRH vs PBKS Highlights : ఐపీఎల్ 2024 69వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన లీగ్ రౌండ్‌లో పంజాబ్ కింగ్స్ తో చివరి మ్యాచ్ ఆడింది. ఇరు జట్లు విజ‌యం కోసం గట్టి పోరాటం చేశాయి. కానీ ఆఖర్లో హైదరాబాద్ త‌న జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ పంజాబ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి హైదరాబాద్‌ ఓపెనింగ్‌ జోడీపై ఉంది. అయితే, ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ ఫ్లాప్ షో చూపించాడు కానీ, మ‌రో ఓపెనింగ్ బ్యాట‌ర్ అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. ధ‌నాధ‌న్ ఆట‌తో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. ఆ త‌ర్వాత హెన్రిచ్ క్లాసెన్ జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చే ఇన్నింగ్స్ ఆడాడు.

పంజాబ్ భారీ స్కోర్..

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టుకు మంచి శుభారంభం ల‌భించింది. అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ప్రభాసిమ్రాన్ కేవలం 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు, అథర్వ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. రోసోవ్ కూడా 49 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన జితేష్ శర్మ కూడా 32 పరుగులు చేసి జట్టు స్కోరును 214కు చేర్చాడు. 

అభిషేక్, క్లాసెన్ క్లాసిక్ షో..

215 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ కు ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ కోల్పోవ‌డంతో షాక్ త‌గిలింది. అయితే, మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న మార్కును చూపిస్తూ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. సీజన్ మొత్తం విధ్వంసం సృష్టించిన అభిషేక్ ఈ మ్యాచ్ లోనూ దూకుడు ప్రదర్శించాడు. యువ బ్యాట్స్‌మెన్ కేవలం 28 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (33), నితీష్ రెడ్డి (37), హెన్రిచ్ క్లాసెన్ (42) తమ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లారు.దీంతో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి హైదరాబాద్

పంజాబ్‌ను ఓడించి హైదరాబాద్ జట్టు రాజస్థాన్‌ను వెన‌క్కినెట్టింది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం రాజస్థాన్‌కు మరింత కీలకంగా మారింది. కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఓడిపోతే క్వాలిఫయర్-1లో హైదరాబాద్ జట్టు కేకేఆర్‌తో తలపడనుంది. 

CSK VS RCB : పోరాడి గెలిచిన ఆర్సీబీ.. కీల‌క మ్యాచ్ లో చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios