ప్రపంచకప్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల ద్వారా జట్టును తిరిగి చేరాడు. దీనిపై గబ్బర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది గాయాలతో ఇబ్బందిపడ్డానని, కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభిస్తానని వెల్లడించాడు.

తన స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లోకేశ్ రాహుల్ బాగా ఆడటం తనను ఎంతగానో సంతోషపరిచిందని శిఖర్ తెలిపాడు. అతనికిచ్చిన అవకాశాన్ని రాహుల్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడని.. ఇప్పుడు తన వంతు వచ్చిందని శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు.

Also Read:దాదా క వాదా: బుమ్రా కోసం గంగూలీ జోక్యం...

ఆటగాళ్లకు గాయాలు సహజమని.. అవి మన నియంత్రణలో ఉండవని, వాటిని అంగీకరించాల్సిందేనని ధావన్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు తన సహచర ఆటగాడు రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఇది తనకు కీలకమైన సమయమని, బాగా రాణించాల్సి వుంటుందన్నాడు.

జట్టుకు దూరమైన ఈ కాలంలోనే తన కుటుంబం భారత్‌లో స్థిరపడేందుకు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాలో ఉండే తన భార్య ఆయేషా, కొడుకు జొరావర్.. భారతదేశానికి వస్తున్నారని, ఇక నుంచి తన వెంట కుటుంబం ఉంటుందని ధావన్ తెలిపాడు.

Also Read:గబ్బర్ ఈజ్ బ్యాక్: నేను బ్యాటింగ్ చేయడం మర్చిపోలేదు

ఇదే సమయంలో కుమారుడు జొరావర్‌తో గడిపిన వీడియోను శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నా బిడ్డ తనను ఎల్లప్పుడూ ఆడేందుకు ప్రేరణనిస్తాడని చెప్పాడు. ఈ వీడియోలో జొరావర్ తన తండ్రి ధావన్‌ తలపై కాలితో తన్నుతూ ఉన్నాడు.

ఈ వీడియో భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. ధావన్ ఈ ఏడాది ప్రపంచకప్‌ సందర్భంగా మొదట చేతి వేలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మెడ, కన్ను, ఇటీవల మోకాలి గాయాలతో సతమతమయ్యాడు. నవంబర్ 21న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి టీ20 మ్యాచ్ తర్వాత అతను మళ్లీ బ్యాట్ పట్టుకోలేదు.