హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాస్ టేలర్ 109, హెన్రీ నికోలస్ 78, టామ్ లేథమ్ 69 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, షమీ, శార్ధూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. 

భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 85 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మార్టిన్ గుప్తిల్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. మరో ఓపెనర్ నికోల్స్ అర్థ సెంచరీ చేశాడు.

ఆ తర్వాత 109 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బ్లండెల్ కేవలం 9 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగులో వెనుదిరిగాడు. ఈ క్రమంలో టేలర్‌తో కలిసి నిలకడగా ఆడుతూ వచ్చిన నికోలస్ 78 పరుగుల వద్ద రన్నవుట్ అయ్యాడు.

అనంతరం కష్టాల్లో పడిన జట్టును రాస్ టేలర్‌తో కలిసి నడిపించిన కెప్టెన్ టామ్ లేథమ్ 309 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. రాస్ టేలర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించిన లేథమ్ 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Also Read:తొలి వన్డేలో రికార్డుల మోత: వీరేంద్రుడి తర్వాత అయ్యరే, ఇంకా మరెన్నో

ఈ క్రమంలో విధ్వంసక ఆటగాడు రాస్ టేలర్ సెంచరీ చేశాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో పడటంతో కెప్టెన్ లేథమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించి విజయానికి చేరువ చేశాడు.

విజయానికి 20 పరుగుల దూరంలో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 328 పరుగుల స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్ 9 కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 331 పరుగుల వద్ద ఉండగా ఆల్‌రౌండర్ గ్రాండ్ హోమ్ 1 టీమిండియా అద్భుత ఫీల్డింగ్‌కు రనౌటయ్యాడు. అయితే చివర్లో మిచెల్ శాంట్నర్‌ 12 తో కలిసి రాస్ టేలర్ లాంఛనాన్ని పూర్తి చేసి, భారత పర్యటనలో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Also Read:పాక్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఓ పానీపూరీ సెల్లర్

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 88తోనూ, కేదార్ జాదవ్ 26 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. కేదార్ జాదవ్ 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు. రాహుల్ 64 బంతులు ఆడి 88 పరుగులు చేశాడు.న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 2, గ్రాండ్ హోమ్ 1, సోధీ 1 వికెట్లు తీశారు.