మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షార్పణం అయ్యింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. మ్యాచ్‌కు పదే పదే వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఉదయం నుంచి వర్షం పడుతూ ఉండటంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సాయంత్రం వర్షం కాస్త తెరిపిని ఇచ్చినప్పటికీ మైదానం చిత్తడిగా ఉండటంతో పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేశారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లక్నో వేదికగా జరగనుంది.

Also Read:భారత్, దక్షణాఫ్రికా మ్యాచ్ :వర్షంతో మ్యాచ్ రద్దు..? బాధ్యులు ఆ పూజారులే!

మరోవైపు ధర్మశాలలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది వరసగా రెండో సారి. గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 వర్షం వల్ల రద్దయ్యింది. తాజా సిరీస్‌లో భాగంగా బుధవారం రెండు జట్ల ప్రాక్టీస్ ముగిసిన వెంటనే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

దీంతో గురువారం టాస్ ఆలస్యమైంది. సాయంత్రం 6.30కి 20 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహించేందుకు వీలవుతుందేమోనని భావించినప్పటికీ నిరాశ తప్పలేదు. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికాల వన్డే సిరీస్‌ను కరోనా భయం వెంటాడుతోంది.

Also Read:ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే: కివీస్ గాయం నుంచి బయటపడేనా...?

తొలి వన్డేకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య పడిపోయింది. ధర్మశాల స్టేడియం కేపాసిటీ 23 వేలు కాగా మైదానంలో ప్రేక్షకుల హడావిడి కనిపించలేదు. ఇదే సమయంలో ఐపీఎల్‌పైనా కరోనా ప్రభావం పడింది.

అన్ని రకాల క్రీడలను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఐపీఎల్ కమిటీకి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మార్చి 14న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై సీజన్ నిర్వహించాలా..? వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనుంది.