ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే: కివీస్ గాయం నుంచి బయటపడేనా...?

భారత్ స్వదేశంలో సఫారీలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతోంది. మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ వచ్చిన దక్షిణాఫ్రికాతో భారత్ నేడు తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వసన్నద్దమయింది. ఈ నేపథ్యంలో అసలు సిరీస్ ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్ కి ముందు ఇరు జట్ల బలాబలాలు ఏమిటో చూద్దాం

India vs South Africa Match preview: Bruised india to take over South Africa

న్యూజిలాండ్ పర్యటన తరువాత భారత జట్టు మానసికంగా ఒకింత దెబ్బతిన్నదని చెప్పవచ్చు. మూడు వన్డేల సిరీస్ ని వైట్ వాష్ గా కోల్పోయి, ఆ తరువాత టెస్టు సిరీస్ ని కూడా కోల్పోయి అపజయ భారంతో తిరిగి వచ్చింది. 

ఇప్పుడు భారత్ స్వదేశంలో సఫారీలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతోంది. మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ వచ్చిన దక్షిణాఫ్రికాతో భారత్ నేడు తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వసన్నద్దమయింది. ఈ నేపథ్యంలో అసలు సిరీస్ ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్ కి ముందు ఇరు జట్ల బలాబలాలు ఏమిటో చూద్దాం. 

ఆస్ట్రేలియాను 3-0తో స్వదేశంలో క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో దక్షిణాఫ్రికా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో వైట్‌వాష్‌కు గురైన భారత్‌ తిరిగి గెలుపు బాట పట్టాలని ఆరాటపడుతోంది. 

ధర్మశాల వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సవాల్‌ను షురూ చేసేందుకు సిద్ధమవుతుండగా.. వరుణుడు మాత్రం కాచుకొని కూచున్నాడు.  గతేడాది ఈ రెండు జట్ల టీ20 మ్యాచ్‌ కు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన వరుణుడు అప్పుడు ఇరు జట్లను మ్యాచ్ ఆడనివ్వలేదు. 

ఇప్పుడు వన్డేకు సైతం ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎక్కడ వస్తాడో అని ఇరు జట్ల క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా భయపడిపోతున్నారు. వరుణ దేవుడు సహకరిస్తే నేడు ధర్మశాలలో భారత్‌, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగే తొలి పోరు ధ్వారా ఈ సిరీస్ మొదలవుతుంది. 

న్యూజిలాండ్ టూర్ కి ముందు గనుక భారత్ గురించి మాట్లాడుకుంటే... ఒక అద్వీతీయమైన జట్టుగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే జట్టుగా అందరూ చెప్పుకునే వారు. వరల్డ్ కప్ లో సఫారీల పేలవ ప్రదర్శన చూసిన వారు భారత్ తో సిరీస్ అంటే... చాలా తేలికగా భారత్ దే సిరీస్ అని అనేవారు. 

కానీ పరిస్థితులు మారిపోయాయి. దక్షిణాఫ్రికా ఇప్పుడు బౌచర్ శిక్షణలో రాటు దేలింది. భారత్ జట్టులోని లోపాలు న్యూజిలాండ్ పర్యటనలో బయటపడ్డాయి. ఇప్పుడు ఈ సమరం విషయానికి వచ్చేసరికి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య పోరు ఏకపక్షంగా ఉండబోదనే విషయం మాత్రం అర్థమైపోతుంది. 

ఐపీఎల్‌ 13కు ముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ భారత్‌ ఆటగాళ్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది.  జట్టుతో కొత్తగా చేరిన ఆటగాళ్లు, జట్టుతో ఉన్న ఆటగాళ్లు ఫామ్‌ చాటుకుని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలని అనుకుంటున్నారు. 

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, టి 20న వరల్డ్ కప్ ల నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌ టెస్టులు, టీ20లకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై కోహ్లిసేనకు కంగారు లేదు. అలాగని ఉదాసీనంగా ఆడే ఆస్కారం లేదు. న్యూజిలాండ్‌ ఓటమి గాయానికి విరుగుడుగా సఫారీపై వన్డే సిరీస్‌ను సాధించటం కోహ్లిసేన తక్షణ కర్తవ్యం. 

స్వదేశంలో వరుసగా టెస్టు సిరీస్‌లు ఓడిన దక్షిణాఫ్రికా వన్డేల్లో మాత్రం మెప్పించింది. నిరుడు భారత్‌తో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న దక్షిణాఫ్రికా నేడు వన్డే సిరీస్‌పైనా ఆశలు పెట్టుకుంది. కరోనా వైరస్‌ భయపెడుతున్నా భారత్‌, దక్షిణాఫ్రికాలు నేడు ధర్మశాలలో వన్డే పోరుకు సై అంటున్నాయి. 

Also read: దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు మాస్క్‌తో చాహల్, అభిమానుల ఆందోళన

మరో 20 రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ, ఆటగాళ్ల ఫోకస్‌ పూర్తిగా ఐపీఎల్‌పై నిమగమైన వేళ, కాస్త విరామం సమయంలో బీసీసీఐ సఫారీతో వన్డే సిరీస్‌కు షెడ్యూల్‌ చేయటంపైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గాయాల నుంచి కోలుకున్న క్రికెటర్లు, యువ క్రికెటర్లకు ఫామ్‌ నిరూపించుకునే వేదికగా ఇది పని చేయనుంది. 

సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రాకతో టాప్‌ ఆర్డర్‌కు అనుభవం తోడైంది. రోహిత్‌ శర్మ సైతం లేని వేళ ధావన్‌ రాక భారత్‌కు ఊరట. యువ సంచలనం పృథ్వీ షా తోడుగా ధావన్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్నాడు. 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సైతం ధావన్‌, పృథ్వీ ఓపెనింగ్‌ కాంబో కలిసొచ్చింది. తొలిసారి ఈ జోడీ భారత్‌కు ఓపెనింగ్‌ చేయనుంది. న్యూజిలాండ్‌ లో స్వల్ప స్కోర్లు మాత్రమే చేసిన పృథ్వీ షా, స్వదేశీ పిచ్‌లపై షా ఈసారి భారీ స్కోర్లతో  మెప్పించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. 

హార్దిక్‌ పాండ్య రాకతో మిడిల్‌ ఆర్డర్‌లో మనీశ్‌ పాండే బెంచ్‌కు పరిమితం కానున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో పాండ్య, జడేజా సహా భువనేశ్వర్‌ కుమార్‌లతో లోతైన బ్యాటింగ్‌ భారత్‌కు లభించనుంది. విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు మిడిల్‌ ఆర్డర్‌ భారం మోయనున్నారు. 

కెఎల్‌ రాహుల్‌ మరోసారి వికెట్ల వెనకాల బాధ్యత తీసుకోనున్నాడు. ఎం.ఎస్‌ ధోని పాత్రలో రాహుల్‌ ఒదిగేందుకు కోహ్లి తగినంత సమయం ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆ పాత్రలో మెప్పించిన రాహుల్‌, సఫారీ సిరీస్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ చోటు సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. 

ఇక బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌ రాకతో షార్దుల్‌ ఠాకూర్‌ బెంచ్‌కు పరిమితం కానుండగా.. సైని, బుమ్రాలు భువితో బంతి పంచుకోనున్నారు. దక్షిణాఫ్రికాపై తిరుగులేని రికార్డున్న యుజ్వెంద్ర చాహల్‌తో కలిసి జడేజా బంతిని స్పిన్‌ చేయనున్నాడు. 

సఫారీలను తక్కువగా అంచనా వేయలేము...  

గత పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసుకున్న రికార్డు, తాజాగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆత్మవిశ్వాసం దక్షిణాఫ్రికాను మరో సిరీస్‌ వేటలో ఫేవరెట్‌గా నిల్పుతున్నాయి. యువ నాయకుడు క్వింటన్‌ డికాక్‌కు భారత్‌ ఫై తిరుగులేని రికార్డుంది. 

టీమ్‌ ఇండియా అనగానే శతకాలు బాదే డికాక్‌, టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అర్థ సెంచరీలు చేస్తున్న డికాక్‌.. చివరగా భారత్‌పై 2015లో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జెజె స్మట్స్‌, మలన్‌లు మెరిశారు. ఈ ఇద్దరూ భారత్‌పై సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. 

Also read: కాబోయే శ్రీమతితో హార్డిక్ పాండ్యా హోలీ సంబరాలు

మాజీ కెప్టెన్‌ డుప్లెసిస్‌, వాన్‌డర్‌ డుసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌లతో మిడిల్‌ ఆర్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. కగిసో రబాడ లేని వేళ లుంగి ఎంగిడి సఫారీ పేస్‌కు నాయకత్వం వహించనున్నాడు.

ఎంగిడితో కలిసి హెండ్రిక్స్‌, ఫెలుక్‌వయో, ఎన్రిచ్‌లు పేస్‌ బాధ్యత పంచుకోనున్నారు. పేస్‌కు అనుకూలించే ధర్మశాలలో కేశవ్‌ మహరాజ్‌ ఒక్కడే స్పిన్‌ కోటాలో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. 

పిచ్‌, వెదర్ కండిషన్స్ ... 

న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన కోహ్లిసేనకు ఇంకా విదేశీ వాతావరణం పోలేదు. ధర్మశాల అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉపఖండంలో ఉన్నామన్న భావన రానీయదు. ధర్మశాల పిచ్‌ ఆది నుంచి పేస్‌కు అనుకూలం. ఇక్కడ టాస్‌ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపుతుంది. దక్షిణాఫ్రికా చివరగా ఇక్కడ ఆడిన వన్డేలో 200 పరుగులను అలవోకగా ఛేదించింది. 

గత నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు ఛేదించిన జట్టునే విజయం వరించింది. 2019 సెప్టెంబర్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 వర్షార్పణం అయ్యింది జూడ ఇక్కడే!. నేడు వన్డేకు సైతం భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. 

గురువారం తెల్లవారుజాము నుంచే 100 శాతం వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. రోజంతా వర్షం కురిసే అవకాశం ఉండటంతో మ్యాచ్‌ జరగటం కష్టమే. వాతావరణం అనుకూలిస్తేనే తొలి వన్డే సాధ్యపడనుంది. 

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) 

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా. 

దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌, జెజె స్మట్స్‌, వాన్‌డర్‌ డుసెన్‌, డుప్లెసిస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌, ఫెలుక్‌వయో, కేశవ్‌ మహరాజ్‌, హెండ్రిక్స్‌, ఎన్రిచ్‌, లుంగి ఎంగిడి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios