Asianet News TeluguAsianet News Telugu

మ్యాచ్ రివ్యూ: వరల్డ్ కప్ ముంగిట ఎన్నెన్నో ప్రశ్నలు... అన్నింటికి లభించిన సమాధానాలు

టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌ ట్రాక్ రికార్డు పేలవం. కనీసం ఛేజింగ్ రికార్డు కూడా అంత బాగోలేదు. ఓవర్ ఆల్ గా టి 20ల్లో న్యూజీలాండ్ దే పైచేయిగా ఉంటూ వచ్చింది. కానీ నిన్నటి మ్యాచులో దానికి భిన్న పరిస్థితులు ఆవిష్కృతమయ్యాయి. 

India vs New Zealand 1st T20I review: from number 4 to keeper this match provided all the solutions for India's hunt for upcoming t 20 world cup
Author
Auckland, First Published Jan 25, 2020, 8:04 AM IST

టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌ ట్రాక్ రికార్డు పేలవం. కనీసం ఛేజింగ్ రికార్డు కూడా అంత బాగోలేదు. ఓవర్ ఆల్ గా టి 20ల్లో న్యూజీలాండ్ దే పైచేయిగా ఉంటూ వచ్చింది. కానీ నిన్నటి మ్యాచులో దానికి భిన్న పరిస్థితులు ఆవిష్కృతమయ్యాయి. 

ఈడెన్ పార్క్ లో చిన్న బౌండరీలే అయినా, భారీ హిట్టర్ల అండ ఉన్నా.. 204 లక్ష్యం భారత్‌కు గట్టి సవాలుగానే తొలుత అనిపించింది. రోహిత్ వికెట్ తరువాత అంతా కలత చెందారు కూడా. 

కాకపోతే... రోహిత్ ఔటయినా, మరో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, విరాట్‌ కోహ్లిల మెరుపుల ముందు 204 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. భారీ లక్ష్యాన్ని ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించిన కోహ్లిసేన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

ఈ మ్యాచుకు ముందు భారత్‌, న్యూజిలాండ్‌లు చివరగా తలపడింది ప్రపంచ కప్ లో.  వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో కీవీస్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ కండ్లుచెదిరే డైరెక్ట్‌ త్రో తో ఎం.ఎస్‌ ధోనిని రనౌట్‌ చేశాడు. ఆ రనౌట్‌తో మ్యాచ్‌ కివీస్‌ చేతుల్లోకి వెళ్లిపోవడం, భారత్ వరల్డ్ కప్ వేట నుండి నిష్క్రమించడం జరిగింది. 

తాజాగా ఆక్లాండ్‌ టీ20 ఛేదనలో కుదురుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినీ సూపర్బ్‌ క్యాచ్‌తో మార్టిన్‌ గప్టిల్‌ వెనక్కి పంపించాడు. ఆ క్యాచ్ ని చూసినవారందరికీ మనసులో ఒక మాట అనిపించడం తథ్యం. ఆ వికెట్ ని బౌలర్ ఖాతాలో కన్నా... ఫీల్డర్ ఖాతాలో జమకడితే బాగుండును అని. 

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ను ఆ వికెట్‌ కాస్త ఒత్తిడిలో పడేసింది. కాకపోతే నేనున్నానంటూ శ్రేయస్ అయ్యర్‌ అజేయ అర్ధ సెంచరీతో కదం తొక్కాడు, న్యూజిలాండ్‌ మనసులోంచే గెలుపు ఆశలను పూర్తిగా తుంచేశాడు. 

ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ వేసిన బలమైన పునాదిపై కోహ్లీ కొద్దిసేపు ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతలను చేపట్టినా... ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ అజేయ ఇన్నింగ్స్‌తో ఇన్నింగ్స్ గెలుపు అనే కట్టడాన్ని పూర్తిచేసి భారత్ కు బోణీ కొట్టించాడు. 

విరాట్‌ కోహ్లి , మనీశ్‌ పాండేలు సైతం రాణించగా 204 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే భారత్‌ ఛేదించింది. న్యూజీలాండ్ ఇన్నింగ్స్ లో కొలిన్‌ మన్రో, రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌ లు  అర్థ సెంచరీలతో కదం తొక్కారు. 

మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. భారత్ తరుఫున అయ్యర్, రాహుల్ లు అర్థ శతకాలను నమోదు చేసారు. ఇలా ఒకే టి 20 మ్యాచులో 5 అర్థ సెంచరీలు నమోదు అవడం ఇదే తొలిసారి. 

ఛేజింగ్ లో కీలక ఇన్నింగ్స్‌ నమోదు చేసి, అజేయుడిగా నిలిచిన శ్రేయస్ అయ్యర్‌ కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఈ 5 మ్యాచుల సిరీస్ లో రెండో టీ20 ఆక్లాండ్‌లోనే రేపు ఆదివారం జరుగనుంది.

రాహుల్‌, విరాట్, అయ్యర్‌... ఈ కాంబినేషన్ డెడ్లీ! 

శ్రేయాస్ అయ్యర్ పై గత కొన్ని రోజులుగా టి 20 ఫార్మాట్లలో విఫలమవుతున్నాడనే అపవాదు బలంగా వినిపిస్తోంది. టి 20 ఫార్మాట్‌లో ఓ మంచి ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ బాకీ పడిన శ్రేయస్ అయ్యర్‌ ఆక్లాండ్‌లో ఆ బాకీ తీర్చేసుకున్నాడు. విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. 

Also read; ముందు రాహుల్, వెనక శ్రేయస్.... కోహ్లీకి రిలీఫ్... ప్రపంచకప్ టీంపై భరోసా

మనీశ్‌ పాండే (14) క్రీజులో జత కలిసిన సమయాన భారత్‌ మరో 40 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. పాండే అండతో 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదేసిన అయ్యర్‌ ఆక్లాండ్‌లో ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు. 

టిమ్‌ సౌథి లెంగ్త్‌ బంతులు, తొలి మ్యాచ్ ఆడుతున్న హమిశ్‌ బెనెట్‌ షార్ట్‌ బంతులపై విరుచుకుపడిన అయ్యర్‌ సీమర్లు వేసిన 17 బంతుల్లోనే 40 పరుగులు పిండుకున్నాడు. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మరో ఎండ్‌లో మనీశ్‌ పాండే సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ చేతిలో ఉన్న తరుణంలో అయ్యర్‌కు స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ సహకరించాడు. సౌథి బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌గా బాదిన అయ్యర్‌ గెలుపు లాంఛనాన్ని ఘనంగా ముగించాడు. 

భారీ ఛేదనలో భారత్‌ ఆరంభంలోనే రోహిత్‌ శర్మ వికెట్ ను కోల్పోయింది. 7 పరుగులు మాత్రమే చేసి రోహిత్ వెనుదిరిగాడు. కొత్త బంతితో టర్న్‌ దొరకబుచ్చుకున్న సాంట్నర్‌ విధ్వంసకారుడు రోహిత్‌ను వెనక్కి పంపించాడు. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి మరో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఓవర్‌ మినహాయిస్తే తర్వాత వరుసగా ఎనిమిది ఓవర్లలో భారత్‌ బౌండరీలు కొట్టింది. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన కెఎల్‌ రాహుల్‌ వ్యక్తిగత స్కోర్ ఎలా పెరుగుతూ వస్తుందో అర్థమవలేదు. అంత సునాయాసంగా బంతులను ఫెన్స్ దాటిస్తూ టి 20 మజాను ప్రేక్షకులకు అందించాడు. 

నిజానికి కెఎల్‌ రాహుల్‌ 27 పరుగుల వద్దే నిష్క్రమించాలి. ఆరో ఓవర్లో లభించిన రెండు రనౌట్ల అవకాశాలను కివీస్‌ వృథా చేసుకుంది. కోహ్లి 33 పరుగుల వద్ద ఉండగా థర్డ్‌మ్యాన్‌లో సోథి సులువైన క్యాచ్‌ నేలపాలు చేశాడు. రాహుల్‌ను సౌథి, కోహ్లిని గప్టిల్‌ మంచి క్యాచ్‌లతో అవుట్‌ చేసి కివీస్‌ శిబిరంలో ఆశలు రేపారు. కానీ శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండేలు ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు చల్లారు. 

న్యూజీలాండ్ కు కలిసి రాలేదంతే... 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. మార్టిన్‌ గప్టిల్‌, కొలిన్‌ మన్రోలు తొలి వికెట్‌కు గట్టి ఓపెనింగ్ పార్టనర్ షిప్ నమోదుచేశారు. మన్రోకు బాడీ లెంగ్త్‌ బంతులతో సవాల్‌ విసిరిన భారత్‌ పెద్దగా సక్సెస్‌ సాధించలేదు. 

లెగ్‌ సైడ్‌ బౌండరీలను అలవోకగా సాధిస్తూ మన్రో మెరుపు అర్థ సెంచరీ సాధించాడు. ఓ సిక్సర్‌, నాలుగు ఫోర్లతో జోరు మీదున్న గప్టిల్‌ను దూబె అవుట్‌ చేయటంతో భారత్‌కు తొలి బ్రేక్‌ లభించింది. 

ఆ తరువాత కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌లు అర్థశతకాలను నమోదు చేసి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చారు. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న విలియమ్సన్‌, టేలర్‌లు భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.  ఏడు సిక్సర్లను బాదారు ఇద్దరు. కొలిన్‌ డీ గ్రాండ్‌హౌమె (0) టిమ్‌ సీఫర్ట్‌ (1) నిరాశపరిచారు. భారత బౌలర్లలో జడేజా, బుమ్రా, దూబె, ఠాకూర్‌లు తలా ఓ వికెట్‌ తీసుకున్నారు.

లభించిన సమాధానాలు...

ఆస్ట్రేలియా పిచ్ లను పోలి ఉండే న్యూజీలాండ్ పిచ్ లపై టి 20 ప్రపంచకప్ కి ముందు మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన భారత జట్టుకు శుభారంభమే దొరికింది. మరో ముఖ్యమైన వేధిస్తున్న సమస్య... నెంబర్ 4 బ్యాట్స్ మెన్ అంశంలో కూడా శ్రేయస్ అయ్యర్ రూపంలో ఒక శాశ్వత పరిష్కారం దొరికినట్టే అనిపిస్తుంది.  

Also read: అంబటి రాయుడు శ్రేయస్ అయ్యర్: సేమ్ టు సేమ్@4

కోహ్లీకి ముందు రాహుల్ రూపంలో ఒక భయంకరమైన స్పెషలిస్ట్ ప్లేయర్, కోహ్లీ తరువాత మరో నిష్ణాతుడైన శ్రేయస్ అయ్యర్ లు ఉండడంతో కోహ్లీ పై ఒకింత ప్రెషర్ తగ్గేలా కనబడుతుంది. దానితోపాటు కీపర్ అనే సమస్యకు కూడా ఒక సొల్యూషన్ దొరికినట్టుగా కనబడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios