Asianet News TeluguAsianet News Telugu

ఇండియా వర్సెస్ శ్రీలంక: టి20 ప్రపంచ కప్ బెర్తులే లక్ష్యం...గెలిపించే ఆటతీరే మార్గం

ఈ టి20 ప్రపంచకప్‌ ఏడాదిలో భారత్‌కు మ్యాచ్‌ విన్నర్లు అవసరం. శ్రీలంక క్రికెట్‌ జట్టు బలమైన పోటీదారుగా నిలిచేందుకు కుర్ర క్రికెటర్లు మెరవాలి. భారత్‌, శ్రీలంకలు స్పష్టమైన లక్ష్యాలతో టీ20 సిరీస్‌లోకి అడుగుపెడుతున్నాయి. 

India versus srilanka 1st t20 match preview...all eyes on openers and bumrah
Author
Guváhátí, First Published Jan 5, 2020, 11:09 AM IST

వరుసగా ఐసీసీ మెగా ఈవెంట్లలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతూ ఆఖర్లో బోల్తా పడుతోంది టీమ్‌ ఇండియా. ఈ ఏడాది కంగారూ గడ్డపై జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌కు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవాలని కోహ్లిసేన భావిస్తోంది. 

20 ఓవర్ల ఆటలో ఉండే విపరీత ఒత్తిడి పరిస్థితులను ఎదురొడ్డి నిలిచే మ్యాచ్‌ విన్నర్లు కోసం కోహ్లిసేన అన్వేషణ మొదలైంది. మరోవైపు కుర్రాళ్లతో కూడిన జట్టుతో వచ్చిన శ్రీలంక, కొత్త ఏడాదిని కొత్తగా ఆరంభించాలని చూస్తోంది. 22 నెలల విరామం అనంతరం భారత్‌, శ్రీలంక తొలి టీ20లో తలపడుతున్నాయి. 

ఈ టి20 ప్రపంచకప్‌ ఏడాదిలో భారత్‌కు మ్యాచ్‌ విన్నర్లు అవసరం. శ్రీలంక క్రికెట్‌ జట్టు బలమైన పోటీదారుగా నిలిచేందుకు కుర్ర క్రికెటర్లు మెరవాలి. భారత్‌, శ్రీలంకలు స్పష్టమైన లక్ష్యాలతో టీ20 సిరీస్‌లోకి అడుగుపెడుతున్నాయి. 

2014 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ ఓటమిని మినహాయిస్తే.. విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ అరంగ్రేటం (12 సంవత్సరాల నుంచి) తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై శ్రీలంక విజయం సాధించలేదు. 22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు టీ20 సమరంలో పోటీపడబోతున్నాయి. 

Also read: శ్రీలంక తో టి20 సిరీస్:ధావన్ వర్సెస్ రోహిత్... ఓపెనర్ల సమరానికి రంగం సిద్ధం

సొంతగడ్డపై వరుస సిరీస్‌ విజయాలు, అన్ని రంగాల్లో తిరుగులేని దూకుడుతో కోహ్లిసేన టీ20 సిరీస్‌లో ఎదురులేని ఫేవరెట్‌. పాకిస్థాన్‌ను కంగుతినిపించిన అనుభవంతో భారత్‌నూ దెబ్బకొట్టాలని శ్రీలంక ఎదురుచూస్తోంది.

టి20 ప్రపంచ కప్ బెర్త్ కోసం బల నిరూపణ... 

జట్టుగా భారత్‌ బలంగా కనిపిస్తున్నా.. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో నిలిచేందుకు ఆటగాళ్లు బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2018లో భారత టీ20 టాప్‌ స్కోరర్‌గా నిలిచినా, ఏడాదిగా టి20  ఫార్మాట్‌లో శిఖర్‌ ధావన్‌ స్ట్రయిక్‌రేట్‌ మందగించింది. 

ఇదే సమయంలో కెఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా దండిగా పరుగులు చేస్తున్నాడు. రోహిత్‌ శర్మ విశ్రాంతితో ఈ ఇద్దరూ తుది జట్టులో ఉన్నారు. రోహిత్‌ వచ్చాక రెండో ఓపెనర్‌ ఈ మూడు మ్యాచుల్లో ప్రదర్శన ఆధారంగా తేలనుంది. 

మిడిల్‌ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్‌ ఆకట్టుకున్నాడు. కానీ ఒత్తిడి పరిస్థితుల్లో నిలబడి జట్టును గెలుపు తీరాలకు చేర్చగల సత్తా ఉందని అయ్యర్‌ నిరూపించుకోవాల్సి ఉంది. యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆడపా దడపా ఇన్నింగ్స్‌లతో కాకుండా నిలకడగా రాణించగలను అని చాటి చెప్పాలి. 

శివం దూబె బిగ్‌ హిట్టర్‌ పేరు నిలుపుకునేందుకు శ్రీలంకతో సిరీస్‌తో వేదిక చేసుకోవాలని చూస్తున్నాడు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌గా అదే జోరు కొనసా గించటంపై దృష్టి సారించనున్నాడు.

Also read: తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి: సీఏఏపై కోహ్లీ స్ట్రాటజీ ఇదే...

జస్ప్రీత్ బుమ్రా రాకతో పేస్‌ విభాగం బలోపేతమైంది. నవదీప్‌ సైని, షార్దుల్‌ ఠాకూర్‌లతో కలిసి బుమ్రా పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ఉందని బుమ్రా గౌహతి టీ20లో నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. భువ నేశ్వర్‌, దీపక్‌ చాహర్‌ గైర్హాజరులో సైని, ఠాకూర్‌ లు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. స్పిన్‌ విభాగంలో చాహల్‌తో కలిసి జడేజా బంతిని పంచుకోనున్నాడు.

యువ రక్తం...అదే లంక బలం...  

టీ20ల్లో బలమైన జట్టు పాకిస్థాన్‌పై 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్‌ విజయం, ఆస్ట్రేలియా చేతిలో 0-3తో సిరీస్ వైట్‌వాష్‌... ఇది శ్రీలంక ఇటీవల రికార్డు. కుర్రాళ్లు జట్టులోకి వచ్చిన తర్వాత శ్రీలంక మళ్లీ బలమైన పోటీదారుగా కనబడుతోంది. 

దిగ్గజ సీమర్‌ లసిత్‌ మలింగ సారథ్యంలో కోహ్లిసేనను ఎదుర్కొనుంది. మరో సీనియర్‌ ఆటగాడు ఎంజెలో మాథ్యూస్‌ అనుభవం శ్రీలంకకు సానుకూలాంశం. యువ ఆటగాళ్లు హసరంగ, ఉదాన, రజిత మెరుగైన ప్రదర్శన చేయగలిగితే భారత్‌కు శ్రీలంక గట్టి పోటీ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది. 

Also read: ఐసీసీ ప్రతిపాదనను ఒప్పుకునే సవాలే లేదు...తేల్చి చెప్పిన కోహ్లీ

డిక్‌వెల్లా, గుణతిలక శ్రీలంక శిబిరానికి కీలకం కానున్నారు. చివరగా నిదహాస్‌ ట్రోఫీలో భారత్‌పై గెలుపొందిన శ్రీలంక.. మళ్లీ గౌహతిలో గెలుపు రుచి చూడాలని ఆశ పడుతోంది. కుర్ర జట్టుతో నూతన ఉత్సాహంతో ఉరకలేస్తోన్న లంకేయులు చిన్న సమరంలో పెద్ద పోటీ ఇవ్వగలరా...? అనేది ఆసక్తికరంగా మారింది. 

పిచ్‌, వెదర్ రిపోర్ట్... 

గౌహతిలోని బర్సాపర స్టేడియంలో ఇది మూడో మ్యాచ్‌. స్వల్ప స్కోఋ మాత్రమే చేసిన భారత్, ఆస్ట్రేలియాతో టీ20లో ఓటమి పాలైంది. వెస్టిండీస్‌తో జరిగిన 300 ప్లస్‌ స్కోర్ల మ్యాచ్‌లో కోహ్లిసేన విజయం సాధించింది. 

గౌహతిలో నేడు రాత్రి వేళల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఎక్కువ. చివరి మ్యాచ్‌లో స్పిన్నర్లు చాహల్‌, జడేజా ప్రభావం చూపారు. భారీ స్కోర్లు నమోదు కానున్న పిచ్‌పై సీమర్లు, స్పిన్నర్లకు సహకారం అందించనున్నారు. టాస్‌ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గు చూపనుంది. రాత్రి ఏడింటి నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్షప్రసారం. 

జట్ల కూర్పు (అంచనా) :

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయాష్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, శివం దూబె, రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్‌, షార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్సె, ఒషాడ ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, నిరోశన్‌ డిక్‌వెల్లా, ధనుష్క గుణతిలక, కసున్‌ రజిత, లసిత్‌ మలింగ, ఇసురు ఉదాన, వహిందు హసరంగ.

Follow Us:
Download App:
  • android
  • ios