చూస్తుండగానే 2019 గడచిపోయింది. 2020లోకి అడుగుపెట్టాము. క్రికెట్ ప్రేమికులకు ఇది టీ20 వరల్డ్‌కప్‌ నామ సంవత్సరం. విరాట్‌ కోహ్లి నాయకత్వంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా భారత్‌ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. 

కొత్త ఏడాదిలో కంగారూ గడ్డపైన కూడా టీ20 వరల్డ్‌కప్‌ వేటలో టీమ్‌ ఇండియా మరోసారి ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతుంది. ఈ టి 20 ప్రపంచ కప్పు కోసం ఏడాదిని అంకితం చేయనున్న కోహ్లిసేన, 2020ని శ్రీలంకతో ఒక చిన్న సవాల్‌తోనే మొదలు పెడుతోంది. 

మూడు టీ20ల కోసం శ్రీలంక జట్టు భారత్‌కు వచ్చేసింది. గౌహతిలో తొలి టీ20లో పోటీపడనున్న భారత్‌, శ్రీలంక అక్కడ్నుంచే టీ20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై ఓ కన్నేయనున్నాయి. రేపు, జనవరి 5 నుంచి ఈ సవాల్‌ మొదలు కానుండగా, సిరీస్‌లో ఆసక్తి రేపుతున్న అంశాలేమితో ఒకసారి చూద్దాం. 

Also read: గర్ల్ ఫ్రెండ్ తో రిషబ్ పంత్ సయ్యాట: ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే

రోహిత్‌ ఆబ్సెంట్ కానీ బుమ్రా ప్రజంట్... 

శ్రీలంకతో పోరు అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు రోహిత్‌ శర్మ. లంకపై రికార్డు ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన రోహిత్‌ ఈ సిరీస్‌లో ఆడట్లేదు. రోహిత్‌కు టీం ఇండియా రెస్ట్ ఇవ్వడం ఒకరకంగా శ్రీలంకకు ఊరట అని చెప్పవచ్చు. 

సెప్టెంబర్‌లో గాయంతో దూరమైన స్టార్‌ సీమర్‌ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకపై టీ20లతో పునరాగమనం చేస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌పై సబీనా పార్క్‌లో 6/27 ప్రదర్శన తర్వాత బుమ్రా మెరుపులు చూసే భాగ్యం క్రికెట్ అభిమానులకు లభించలేదు. 

వెన్ను నొప్పి నుండి కోలుకున్న బుమ్రా ఇప్పటివరకూ నెట్స్‌లోనే బౌలింగ్‌ చేశాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపణ అవసరం లేకుండానే, నేరుగా గౌహతి టీ20లోనే బౌలింగ్‌ చేయనున్నాడు. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ, ఫోకస్‌ బుమ్రాపైనే అని చెప్పకతప్పదు. 

Also read: నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్

సైని, ఠాకూర్‌ లు నిరూపించుకునేనా  

గాయాలకు గురైన భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌ల రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది యువ సీమర్లు నవదీప్‌ సైని, షార్దుల్‌ ఠాకూర్‌లకు కలిసొచ్చే అంశం. వెస్టిండీస్‌తో కటక్‌ వన్డేలో పేస్‌తో సైని విశేషంగా ఆకట్టుకున్నాడు. 

షార్దుల్‌ ఠాకూర్‌ బంతితో పాటు ఛేదనలో కూడా జడేజాతో కలిసి మెరిశాడు. టీ20 సిరీస్‌లో ఈ ఇద్దరు పేసర్లకు మూడు మ్యాచులు ఆడే అవకాశం లభించింది. వరల్డ్‌కప్‌ జట్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం దక్కటంతో, వీరిద్దరూ టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్ కోసం తమని తాము నిరూపించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించనున్నారు. 

ధావన్ వర్సెస్ రాహుల్...రోహిత్ జోడి ఎవరో? 

రోహిత్‌ శర్మకు టీం ఇండియా రెస్ట్ ఇవ్వడంతో ఓపెనర్ రేస్ ఆసక్తికరంగా మారింది. లోకేశ్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌లు ఇద్దరూ తుది జట్టులో ఉండనున్నారు. రోహిత్‌ శర్మ తిరిగొచ్చిన తర్వాత రెండో ఓపెనర్‌ ఎవరనే ప్రశ్న ఈ సిరీస్‌తో తేలనుంది. 

రాహుల్‌, ధావన్‌ ఓపెనర్‌ స్థానం కోసం నేరుగా పోటీపడుతున్నారు. ధావన్‌ లేనప్పుడు రాహుల్‌ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుసగా 62, 11, 91, 6, 102, 77 పరుగుల ఇన్నింగ్స్‌ లతో మెరిశాడు రాహుల్. 

2019లో రాహుల్‌ ఆడిన అన్ని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. వరల్డ్‌కప్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. ఐపీఎల్‌ పరుగుల వేటలో టాప్‌లో నిలిచాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో దంచి కొట్టాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించాడు. అన్నింటా మెరిసినా, ఓపెనర్‌గా మాత్రం ఇంకా స్థానం ఖాయం చేసుకోలేకపోయాడు.

సీనియర్‌ ఓపెనర్‌, రెగ్యులర్‌ స్ట్రయికర్‌ శిఖర్‌ ధావన్‌ ది సైతం విస్మరించలేని రికార్డు. 2018 టీ20ల్లో ధావన్‌ టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 689 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 521 పరుగులు కొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్‌ శర్మ కు తోడుగా ధానన్‌ కు తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది టీం. ఎడమచేతి వాటం అవడం ఇక్కడ ధావన్ కి కలిసివచ్చే ఒక అంశం. ఆ ప్రాధాన్యతను నిలుపుకునేందుకు ధావన్‌ కొన్ని మెరుగైన ప్రదర్శనలు చేస్తే సరిపోతుంది.

భవిష్యత్‌పై శ్రీలంక చూపు : 

కొత్త ఏడాదికి ఆరంభించే ముందు శ్రీలంక టీ20 జట్టులో రెండు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. యువ జట్టు 3-0తో పాకిస్థాన్‌పై సిరీస్‌ సాధించగా, సీనియర్‌ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. 

స్కూల్‌ క్రికెట్‌లో పరుగుల సునామీ సృష్టించిన భనుక రాజపక్సెపై విపరీతమైన హైప్‌ ఉంది. పాకిస్థాన్‌పై మెరిసిన రాజపక్సె ఆ జోరుతోనే భారత్‌తో పోరుకు సిద్ధపడుతున్నాడు. అవిష్క ఫెర్నాండో శ్రీలంక జట్టులో వేగంగా వృద్ది చెందుతున్న మరో బ్యాట్స్‌మన్‌. 

వరల్డ్‌కప్‌లో నిరాశపరిచినా ఫెర్నాండోకు వీలైనన్ని అవకాశాలు ఇచ్చేందుకు మలింగ రెడీ అవుతున్నాడు. ధనుష్క గుణతిలకతో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్‌ మొదలెట్టనున్నాడు. యువ ఆటగాళ్లపై విశ్వాసం ఉంచుతూనే, సీనియర్‌ ప్లేయర్‌ మాథ్యూస్‌ను శ్రీలంక ఈ పోరుకు ఎంపిక చేసింది. చివరగా 2018 ఆగస్టులో టీ20 ఆడిన ఎంజెలో మాథ్యూస్‌ భారత్‌తో టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు.

శ్రీలంక శిబిరంలో యువ ఆల్‌రౌండర్లపై ఆసక్తి నెలకొంది. వాహిందు హసరంగ, ఇసురు ఉదాన కీలకం కానున్నారు. విలక్షణ లెగ్‌ స్పిన్నర్‌ హసరంగ వన్డే అరంగ్రేటంలోనే హ్యాట్రిక్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

పాక్‌తో టీ20 సిరీస్‌లో వరుసగా 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. లెఫ్టార్మ్‌ సీమర్‌ ఉదాన స్లో పిచ్‌లపైనా ప్రభావం చూపగలడు. స్లో బాల్స్‌ ప్రయోగంలో ఉదాన స్పెషలిస్ట్‌. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్‌తో చెలరేగే సత్తా ఉదాన, హసరంగ సొంతం.

భారత్‌లో శ్రీలంక చివరి ఐదు టీ20ల్లో పరాజయాలు చవిచూసింది. శ్రీలంక కుర్రాళ్లు ఒత్తిడిని తట్టుకుని నిలబడితే పాకిస్థాన్‌పై సాధించిన విజయం భారత్‌పైనా పునరావృతం చేసే అవకాశం లేకపోలేదు. విజయంపై ఎటువంటి అనుమానం లేకుండా బరిలోకి దిగుతున్న కోహ్లిసేన అస్త్రాలకు మరింత పదును పెట్టుకోవాలని చూస్తుంది.