దేశమంతా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ర్యాలీలు సభలు, సమావేశాలు అనేకం జరుగుతున్నాయి. దేశంలోని సెలెబ్రిటీలు ఈ విషయం పై తమ వైఖరి చెప్పడానికి ఇష్టపడడం లేదు. కొందరు బయటకు చెబుతున్నప్పటికీ...చాలామంది మాత్రం ఆ విషయమై మాట్లాడడానికే జంకుతున్నారు. 

తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ పౌరసత్వసవరణ చట్టం కాక తగిలింది. మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... పౌరసత్వ సవరణ చట్టం పై పూర్తిస్థాయి అవగాహన లేకుండా తాను స్పందించలేనని స్కిప్పర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇది చాలా సున్నితమైన అంశమని, విషయంపై అవగాహన లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడడం భావ్యం కాదని, తాను అలా మాట్లాడబోనని అన్నాడు.

also read అంతర్జాతీయ క్రికెట్ కు ఇర్ఫాన్ పఠాన్ గుడ్ బై


కోహ్లీ ఇలా ఏమి చెప్పకుండా ఉండడానికి వాస్తవానికి అతనికి తెలియకపోయి ఉండవచ్చు అనేది ఒక కారణమైతే... ఎందుకు ఇరకాటంలో పది విమర్శలను ఎదుర్కోవడం అసలైన కారణంగా మనకు కనబడుతుంది. గతంలో అలంటి ఒక సంఘటన కూడా ఉంది. 2016లో నోట్ల రద్దును కోహ్లీ సమర్థించాడు. 

భారత రాజకీయాల్లో దీనినో గొప్ప ముందడుగుగా పేర్కొన్నాడు. నోట్ల రద్దును కోహ్లీ సమర్థించడాన్ని చాలామంది తప్పుబట్టారు. పూర్తిస్థాయిలో అవగాహన లేకుండానే సమర్థించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే కోహ్లీ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అనే అనుమానం కలుగుతుంది. 
 
కొన్ని రోజుల క్రితం వరకు గౌహతిలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అవి హింసకు కూడా దారితీసాయి. ఈ నేపథ్యంలోనే అక్కడకు మ్యాచ్ ఆడేందుకు వచ్చిన కోహ్లీని సీఏఏపై స్పందించాల్సిందిగా మీడియా అడిగింది. 

also read నటాషాతో నిశ్చితార్థం: హార్దిక్ పాండ్యా పేరెంట్స్ షాక్, కానీ...
 
పౌరసత్వ సవరణ చట్టం విషయమై బాధ్యతారహితంగా మాట్లాడలేనని, ఆ విషయం గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సీఏఏపై పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, మొత్తం దాని గురించి తెలిసిన తర్వాత కానీ తన అభిప్రాయం ఏంటనేది చెప్పలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

మనం ఒకటి మాట్లాడితే, మరొకరు ఇంకొకటి చెబుతారని, కాబట్టి తనకు తెలియని దాని గురించి తాను మాట్లాడలేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గౌహతిలో తొలి మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.  మ్యాచ్ నేపథ్యంలో గౌహతిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.