మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టుకు నష్టం జరుగుతుందని తెలిస్తే ఎవ్వరినీ లెక్క చేయడనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్నోసార్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏకంగా అంపైర్‌తోనే కోహ్లీ గొడవకు దిగాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్ చాహల్ వేసిన 17వ ఓవర్‌లో కివీస్ ఓపెనర్ హెన్నీ నికోలస్ ఎల్బీగా ఔటయ్యాడు. ఈ సందర్భంగా అవతలివైపు ఎండ్‌లో వున్న మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌తో చర్చించిన అనంతరం నికోలస్ ఆలస్యంగా సమీక్షకు వెళ్లాడు.

Also Read:స్పాట్ ఫిక్సింగ్: పాక్ మాజీ క్రికెటర్ నసీర్ జంషెడ్ కు జైలు శిక్ష

నిర్ణీత గడువు తర్వాత అతను డీఆర్ఎస్‌కు వెళ్లడంపై విరాట్ కోహ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇందుకు అనుమతించిన ఆన్‌ఫీల్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే టీవీ సమీక్షలో నికోలస్ ఔట్ అని తేలడంతో కోహ్లీ కొంత శాంతించాడు.

కాగా ఆక్లాండ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 273 పరుగులు చేయగా... అనంతరం బరిలోకి దిగిన భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Also Read:కివీస్ పై సిరీస్ ఓటమి: విరాట్ కోహ్లీ ఓదార్పు మాటలు ఇవీ...

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చినా.. కివీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్ 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.