కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషెడ్ కు 17 నెలల జైలు శిక్ష పడింది. అతనితో పాటు ఇద్దరు బ్రిటిషి క్రికెటర్లు యూసెఫ్ అన్వర్, మహ్మద్ ఇజాజ్ లకు కూడా శిక్ష పడింది. 

దుబాయ్ వేదికగా 2018 ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇస్లామాబాద్, పెషావర్ జాల్మీ జట్ల టీ20 మధ్య మ్యాచు జరిగింది. ఈ మ్యాచులో తోటి ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడేలా జంషేడ్ ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఈ ముగ్గురు కూడా నేషనల్ క్రైమ్ ఏజెన్సీ విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. దాంతో వారికి శిక్ష పడింది. మాంచెస్టర్ క్రౌన్ కోర్డు న్యాయమూర్తి రిచర్డ్ మాన్సెల్ జంషెడ్ కు 17 నెలలు, అన్వర్ కు 40 నెలలు, ఇజాజ్ కు 30 నెలలు జైలు శిక్ష విధించారు. 

నసీర్ జంషెడ్ పాకిస్తాన్ తరఫున రెండు టెస్టు మ్యాచులు, 48 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ నిరుడు ఈ కేసులో విచారణ జరిపి నసీర్ జంషెడ్ పై పదేళ్ల నిషేధం విధించింది.