Asianet News TeluguAsianet News Telugu

ICC: ఇక మీ ఓపిక.. క్రికెట్టుకు లేదిక తీరిక.. పదేండ్ల దాకా పండుగే.. ఏడాదికో మెగా టోర్నీ.. ఇండియాలో ఎన్నంటే..?

Upcoming Cricket World Cup Schedule: క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది.  వన్డే ప్రపంచకప్ కోసమో.. టీ20 వరల్డ్ కప్ కోసమో మీరు రోజులకొద్దీ వేచి చూడాల్సిన పన్లేదు. వచ్చే ఏడాది నుంచి వచ్చే పదేండ్ల దాకా పండుగే పండుగ.. 

ICC announces T20 WC and ODI World cup Schedules, India to Host Three Mega Events, here Is The Full List
Author
Hyderabad, First Published Nov 17, 2021, 12:00 PM IST

మీరు క్రికెట్ అభిమానులా..? అయితే మీకు ఇది శుభవార్తే. అలాంటిలాంటి గుడ్ న్యూస్ కాదు. ఇక నుంచి నాలుగేండ్లకోసారి జరిగే ప్రపంచకప్ వైపో.. రెండేండ్లకోసారి జరిగే టీ20 ప్రపంచకప్ వైపో వేచి చూడాల్సిన పన్లేదు. ఇక నుంచి ప్రతి ఏడాదీ పండుగే. ఏకంగా పదేండ్ల పాటు క్రికెట్ విందే.. ఆ ఏముందిలే.. ఏదో  ముక్కోణపు టోర్నీలో లేక మరేదో అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు.. అంతకుమించి.. అంతర్జాతీయంగా క్రికెట్ ఆడటానికి అర్హత పొందిన అన్ని దేశాలు ఆడాల్సిందే. అభిమానులకు క్రీడా విందు పంచాల్సిందే. రికార్డులు బద్దలవ్వాల్సిందే.. కొత్త చాంపియన్లు పుట్టాల్సిందే. అవును.. ఇది నిజం.. ఎలాగంటారా..? అయితే ఇది చదవాల్సిందే.. 

వచ్చే పదేళ్ల దాకా తాను నిర్వహించే మెగా టోర్నీలకు సంబంధించిన షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసింది. మూడు రోజుల క్రితమే 2021 టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే.. T20 World Cup 2022నకు సంబంధించిన వేదిక (ఆస్ట్రేలియా) లను కూడా ఐసీసీ మంగళవారం ట్విట్టర్ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత.. 2023 లో వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నది.  దీనిని ఇండియాలోనే నిర్వహించనున్నారు. ఇక 2024 నుంచి 2031 దాకా ప్రతి ఏడాది ఓ మెగా టోర్నీ జరుగనుంది.  ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 

ఐసీసీ షెడ్యూల్ ఇదే.. 

2024.. టీ20 ప్రపంచకప్.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు : వెస్టిండీస్, అమెరికా 
2025.. ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశం : పాకిస్థాన్ 
2026.. టీ20 ప్రపంచకప్.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు : ఇండియా, శ్రీలంక
2027.. వన్డే ప్రపంచకప్.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు : దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా 
2028.. టీ20 ప్రపంచకప్.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 
2029.. ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశం : ఇండియా 
2030.. టీ20 ప్రపంచకప్.. ఆతిథ్యం ఇవ్వనున్న  దేశాలు : ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్
2031.. వన్డే ప్రపంచకప్.. ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు : ఇండియా, బంగ్లాదేశ్ 

ఇది కూడా చదవండి : T20 World Cup 2022: వచ్చే ఏడాది మరో పొట్టి ప్రపంచకప్.. వేదికలు ఖరారు చేసిన ఐసీసీ.. ఫైనల్ ఎక్కడంటే..?

మొత్తం 14 దేశాలలో.. 

పదేండ్లలో జరుగబోయే ఈ మెగా ఈవెంట్లు 14  దేశాల్లో జరుగనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి  ప్రపంచకప్ టోర్నీలు అగ్రరాజ్యం అమెరికా, నమీబియా లలో కూడా నిర్వహించనుండటం గమనార్హం. కాగా.. పదేండ్లలో మూడు మెగా టోర్నీలు (2026 టీ20, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్) ఇండియాలోనే జరుగనుండటం భారత అభిమానులకు పండుగే.  చిన్న జట్టే అయినా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ లో నాణ్యమైన క్రికెటర్లను అందించి ఇప్పుడు కనుమరుగైన జింబాబ్వే లో 2027 వన్డే ప్రపంచకప్ ను నిర్వహించనున్నారు. దక్షిణాఫ్రికా, నమీబియాతో కలిసి జింబాబ్వే.. ఈ వరల్డ్ కప్ అతిథ్య హక్కులు చేజిక్కించుకుంది. 

 

రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ లో.. 

ఉగ్రవాదులను పెంచి పోషించి చివరికి తాను తీసిన గోతిలో తానే పడ్డ పాకిస్థాన్ కు రెండు దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించే అవకాశం దక్కింది.  చివరగా ఆ దేశం 1996 (వన్డే ప్రపంచకప్) నిర్వహించింది. ఆ తర్వాత పాక్ లో భారీ టోర్నీ జరిగిన దాఖలాలు లేవు. ఇక 2009 లో ఆ దేశ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లపై తీవ్రవాదులు దాడులు చేయడంతో  అంతర్జాతీయ క్రికెట్ దేశాలు పాకిస్థాన్ వంక చూడటమే మానేశాయి. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో క్రికెట్ కు సంబంధించిన పురోగతి కనిపిస్తున్నది. ఇటీవల న్యూజిలాండ్  ఆ దేశ పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో  హ్యాండ్ ఇచ్చినా..  వచ్చే ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా మూడు ఫార్మాట్లలోనూ  సిరీస్ లు ఆడేందుకు పాకిస్థాన్ కు రానున్నది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్థాన్ లో నిర్వహించనుండటం పాక్ క్రికెట్ కు శుభ పరిణామమే.

Follow Us:
Download App:
  • android
  • ios