Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup 2022: వచ్చే ఏడాది మరో పొట్టి ప్రపంచకప్.. వేదికలు ఖరారు చేసిన ఐసీసీ.. ఫైనల్ ఎక్కడంటే..?

T20 World Cup 2022: 2021 ప్రపంచకప్ మాదిరిగానే వచ్చే ఏడాది కూడా మొత్తం 12 జట్లు సూపర్-12 లో పోటీ పడుతాయి. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 దాకా (దాదాపు నెల రోజుల పాటు) ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

T20 World cup 2022: ICC confirms venues For The next Global Event in Australia, Final will be host by MCG
Author
Hyderabad, First Published Nov 16, 2021, 12:23 PM IST

కరోనా కారణంగా గత రెండేండ్లుగా ప్రపంచమంతా స్థంబించిన విషయం తెలిసిందే. అయితే ఆ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశాలు కోలుకుంటున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో థర్డ్, ఫోర్త్ వేవ్ లు కూడా వచ్చాయి. అయితే కొద్దిరోజులుగా వ్యాక్సిన్లు, హర్డ్ ఇమ్యూనిటీ కారణంగా ప్రపంచం కాస్తంత కుదుటపడుతున్నది. క్రీడా లోకం కూడా కరోనా ఆంక్షల నుంచి బయటపడుతున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి  (ICC)కూడా గతేడాది కరోనా వల్ల వాయిదా పడ్డ టీ20 ప్రపంచకప్ ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. ఈ మేరకు వేదికలు కూడా ఖరారు చేసింది. 2021 టీ20  ప్రపంచకప్ ముగిసి రెండ్రోజులు కూడా కాకముందే వచ్చే ఏడాది జరిగే  పొట్టి కప్పునకు సంబంధించిన షెడ్యూలును ఐసీసీ విడుదల చేయడం గమనార్హం.  

కాగా.. 2022 లో జరిగే T20I World Cup ను అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 దాకా (దాదాపు నెల రోజుల పాటు) నిర్వహించనున్నారు. Austrliaలో  జరిగే ఈ మ్యాచుల కోసం ఏడు వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. ఆసీస్ లోని మెల్బోర్న్, అడిలైడ్, బ్రిస్బేన్ జీలాంగ్, హోబర్ట్, పెర్త్, సిడ్నీలలో T20 World Cup 2022 జరుగనున్నది. మొత్తం 45 మ్యాచులు జరుగుతాయి. 

ఈ జట్లకు డైరెక్టు ఎంట్రీ..

తాజా ర్యాంకుల ఆధారంగా ప్రస్తుత ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా, రన్నరప్  న్యూజిలాండ్  తో పాటు మరో  ఆరు జట్లు ఈ టోర్నీకి డైరెక్టుగా అర్హత సాధించాయి. అవి.. దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా. కాగా.. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ లో దారుణ పరాజయాల కారణంగా మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంకలు క్వాలిఫయింగ్ రౌండ్ ఆడాల్సి ఉంది. క్వాలిఫయింగ్ రౌండ్లలో విండీస్, లంకతో పాటు నమీబియా, స్కాట్లాండ్ తో పాటు మరో నాలుగు జట్లు కూడా  అర్హత  రౌండ్లలో పోటీ పడాల్సి ఉంది. అయితే ఈ నాలుగు జట్లేవనేది ఈ ఏడాది కాలంలో నిర్వహించే ఆయా జట్ల ప్రదర్శనలను బట్టి నిర్ణయిస్తారు. 

 

ఆ వేదికలు ఇవే..

2021 ప్రపంచకప్ మాదిరిగానే వచ్చే ఏడాది కూడా మొత్తం 12 జట్లు సూపర్-12 లో పోటీ పడుతాయి. అక్టోబర్ 16 న మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ లో నవంబర్ 9, 10 న  ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సెమీఫైనల్ జరుగనుంది. ఇక ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) లో నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. 

గతేడాది నిర్వహించిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ తో పాటు 2021 టీ20 టోర్నీ కూడా విజయవంతం కావడంతో  వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహిస్తామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, వచ్చే టీ20 వరల్డ్ కప్ లో ఫుల్ కెపాసిటీ ప్రేక్షకుల మధ్య మ్యాచులను నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మరి ఆసీస్ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా..? లేదా..? అన్నది తెలియాలంటే కొద్దికాలం వేచి చూడాల్సిందే. 

సీటింగ్ కెపాజిటీ ఎంతంటే..?

ఇక ప్రపంచకప్ లు జరిగే వేదికల  సీటింగ్ కెపాజిటీ కింది విధంగా ఉంది. 1. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ - 48వేల మంది. 2.మెల్బోర్న్ - ఒక లక్షకు పైగా.. 3. అడిలైడ్ - 53 వేలు.. 4. బ్రిస్బేన్ - 42 వేలు.. హోబర్ట్ - 20 వేలు.. పెర్త్ - 60 వేలు.. జీలాంగ్ -34 వేలు గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios