బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయి తీవ్ర నిరాశకు గురైన భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌కు మరో పదవి దక్కేలా కనిపిస్తోంది. జోనల్ పద్ధతిని పాటించడంతో అగార్కర్ సెలక్టర్ల రేసులోనే కనిపించలేదు.

అయితే రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో నుంచి వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, లక్ష్మణ్ శివరామకృష్ణన్, హర్విందర్ సింగ్, రాజేశ్ చౌహన్‌లను ఇంటర్వ్యూల కోసం షార్ట్ లిస్ట్ చేశారు.

Also Read:వెంకటేశ్ ప్రసాద్‌కు నిరాశ, బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషీ

గత సెలక్షన్ కమిటీలోని గగన్ ఖోడా సెంట్రల్ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్ నుంచి హర్విందర్ సింగ్‌ను.. మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్ జోన్ కావడంతో వెంకటేశ్ ప్రసాద్, శివరామకృష్ణ్, సునీల్ జోషిలను తదుపరి దశలకు ఎంపిక చేశారు.

ఇక్కడ సునీల్ జోషీ, హర్విందర్ సింగ్‌లను సీఏసీ ఎంపిక చేసి.. సునీల్‌కు చీఫ్ సెలక్టర్ బాధ్యతలు కట్టబెట్టింది. ఇక అగార్కర్ విషయానికి వస్తే.. సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం ఉన్న పరంజపే, దేవాంగ్ గాంధీ, శరణ్ దీప్ సింగ్‌ల పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనుంది.

దీంతో అగార్కర్‌తో పాటు నయాన్ మోంగియా, మణిందర్ సింగ్‌ తదితరులు మరోసారి దరఖాస్తు చేసుకోకుండానే రేసులో నిలిచే అవకాశం ఉంది. పరంజపే ముంబైకి చెందినవాడు కావడంతో అగార్కర్‌కు అతని స్థానం దక్కే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అవకాశం దక్కాలంటే ఏడు నెలల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.

Aslo Read:తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి

అగార్కర్ ఎంపిక గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం సానుకూలంగానే స్పందించాడు. భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ అయ్యేందుకు అగార్కర్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయని, కాకపోతే జోనల్ విధానాన్ని అనుసరించడం వల్ల అతను చీఫ్ సెలక్టర్ అవకాశాన్ని కోల్పోయాడని గంగూలీ తెలిపాడు.

ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ముగ్గురి పదవీ కాలం ముగిసిన తర్వాత అగార్కర్‌ను పరిగణలోకి తీసుకుంటామని దాదా వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి సెప్టెంబర్‌లో అగార్కర్‌కు ఖచ్చితంగా అవకాశాలు దక్కవచ్చు.