బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితులయ్యారు. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సునీల్ జోషి పేరును బీసీసీఐకి సిఫారసు చేసింది. 

చీఫ్ సెలక్టర్ ఎంపిక కోసం బుధవారం సమావేశమైన సీఏసీ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకుని తుది జాబితాలో చేరిన వారిని ఇంటర్వ్యూ చేసింది. మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ సునీల్ వైపే సీఏసీ మొగ్గు చూపింది. అలాగే సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేసర్ హర్విందర్ సింగ్‌ను ఎంపిక చేసింది. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం సునీల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. 

సునీల్ జోషీ భారత్ తరపున 1996- 2001 మధ్యకాలంలో 15 టెస్టులు, 69 వన్డేలు ఆడారు. గత సెలక్షన్ కమిటీలో ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల పదవీకాలం ఇప్పటికే ముగియగా.. జతిన్ పరంజపే, సారాదీప్ సింగ్, దేవాంగ్ గాంధీల పదవీ కాలం మరికొద్దినెలల్లో ముగియనుంది. కాగా చీఫ్ సెలక్టర్ ఎంపిక నేపథ్యంలో సీఏసీ మంగళవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షాలను కలిసి పలు సూచనలు తీసుకుంది. ఈ భేటీ ముగిసిన వెంటనే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులో ఉన్న అజిత్ అగార్కర్ దరఖాస్తును తిరస్కరించిన సంగతి తెలిసిందే.