అండర్-19 ప్రపంచకప్ గెలిచిన అనంతరం బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసిన ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ దేశ కెప్టెన్ అక్బర్ అలీ.. విజయానంతరం మా వాళ్లు అలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. మెగాకప్ గెలిచినా అంత అతి అవసరం లేదే.. ఏదైతే జరిగిందో అది నిజంగా దురదృష్టకర సంఘటనగా వ్యాఖ్యానించాడు.

తమ జట్టు క్రికెటర్లు గతంలో జరిగిన ఆసియాకప్‌కు ప్రతీకారంగా దీనిని భావించారని.. అప్పుడు ఫైనల్‌లో తాము ఓటమిని చూశామని, ఇప్పుడు విజయం సాధించేసరికి అలా చేశారని అక్బర్ అభిప్రాయపడ్డాడు. జంటిల్మెన్ గేమ్‌లో ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వాలని.. తమ జట్టు తరపున భారత జట్టుకు క్షమాపణలు చెబుతున్నట్లు అక్బర్ తెలిపాడు.

Also Read:బంగ్లాపై అండర్ 19 ఫైనల్: ఇండియాకు మరో ధోనీ దొరికాడు

టీమిండియా ఆటగాళ్లు టోర్నీ అసాంతం అద్భుతంగా ఆడారని.. బంగ్లాదేశ్ విజయాన్ని కోరుకున్న వారందరికీ అక్బర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది తమకు ఆరంభం మాత్రమేనని.. తర్వాత కూడా ఈ గెలుపు తమకు స్ఫూర్తిగా నిలుస్తుందని అక్బర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా అండర్-19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్..టీమిండియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి విశ్వవిజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ట్రోఫీ ప్రదానం తర్వాత బంగ్లా కుర్రాళ్లు రెచ్చిపోయారు.

Also Read:అండర్ 19 ఫైనల్: బంగ్లా బ్యాడ్ రియాక్షన్ పై ఇండియా కెప్టెన్ భగ్గు

భారత ఆటగాళ్ల వద్దకు వచ్చి గొడవకు దిగారు.. దీంతో ఇరు వర్గాల దాదాపు కొట్టుకున్నంత పని జరిగింది. మధ్యలో అంపైర్లు, సహాయక సిబ్బంది వచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశారు.

బంగ్లా ఆటగాళ్ల అతిపై భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో గెలుపు, ఓటములు సహజమని, అయితే బంగ్లా గెలుపు సంబరాలు పరమ చెత్తగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు.