పోచెఫ్ స్ట్రూమ్: బంగ్లాదేశ్ తో జరిగిన అండర్ 19 ఫైనల్ మ్యాచులో భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని గుర్తుకు తెచ్చాడు. ధ్రువ్ అత్యంత వేగంగా కదిలి స్టంప్ ఔట్ చేసిన తీరు ధోనీని తలపించింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ షాదత్ హుస్సేన్ ను ధ్రువ్ రెప్పపాటులో స్టంపౌట్ చేశాడు. 

ప్రస్తుతం ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవరులో వేసిన బంతిని హుస్సేన్ ముందుకు వచ్చి రక్షణాత్మకంగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ కు కొద్ది తగిలి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. ఆ బంతిని ధ్రువ్ అందుకుని రెప్పపాటులో స్టంప్ లను గిరాటేశాడు. దీంతో అతను వికెట్ కీపింగ్ లో ధోనీ తలపిస్తున్నాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also Read: అండర్ 19 ఫైనల్: బంగ్లా బ్యాడ్ రియాక్షన్ పై ఇండియా కెప్టెన్ భగ్గు

ధ్రువ్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టే విషయాన్ని గ్రహించి కాలు వెనక్కి జరిపేలోగానే అంతా అయిపోయింది. ఫైనల్ మ్యాచులో భారత్ బంగ్లాదేశ్ పై మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనరప్ యశస్వి జైశ్వాల్ 88 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ అక్బర్ అలీ 43 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. 41 ఓవర్లకు బంగ్లా ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసిన సందర్భంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దాంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.