పోచెఫ్ స్ట్రూమ్: అండర్ 19 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై భారత కెప్టెన్ ప్రియం గార్గ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఫైనల్ లో ఓటమి పాలైనప్పటికీ తమ జట్టు బాగా ఆడిందని భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ అన్నాడు. ఆట ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నాడు. 

తాము మామూలుగానే ఉన్నామని, ఆటలో గెలుపూఓటములు సహజమని, ప్రత్యర్తి జట్టు రియాక్షన్స్ చెత్తగా ఉన్నాయని ఆయన అన్నాడు. అలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అన్నాడు. 

Also Read: అండర్ 19 ఫైనల్: బంగ్లాదేశ్ క్రికెటర్ల చెత్త ప్రవర్తన, అగ్లీ సీన్స్

కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని, ఆటగాళ్లు ఉద్వేగానికి గురి కాకూడదని, అటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా కూడా మంచివి కావని, క్రికెట్ క్రీడకు అవి మంచివి కావని, ఇటువంటి సంఘటనల పట్ల భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నానని భారత కోచ్ పరస్ మెంబ్రే అన్నాడు.

మ్యాచును గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ తన జట్టు తరఫున క్షమాపణలు కూడా చెప్పాడు. ఉద్వేగానికి గురై తమ ఆటగాళ్లు కొందరు అతిగా ప్రవర్తించాడని అన్నాడు. 

Also Read: అండర్19 ఫైనల్: కొంచమైతే దివ్యాంశ్ సక్సేనా తలపగిలిపోయేది

ఏం జరిగిందనేది పూర్తిగా తనకు తెలియదని, అయితే, అలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అన్నాడు. ఫైనల్ లో ఉద్వేగాలు ఉంటాయని, అయితే కొందరు దానివల్ల అతిగా ప్రవర్తించారని అన్నాడు. ప్రత్యర్థులను గౌరవించాల్సి ఉంటుందని అన్నాడు. ఆట పట్ల గౌరవం ప్రదర్శించాలని, ఎందుకంటే ఇది జెంటిల్ మెన్ గేమ్ అని, తన జట్టు తరఫున సారీ చెబుతున్నానని ఆయన అన్నాడు.

ఇండియాపై తాము ఆసియా కప్ ఫైనల్ లో ఓటమి పాలయ్యామని, తమ జట్టు సభ్యులు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారని, అది జరిగి ఉండాల్సింది కాదని అన్నాడు. 

అండర్ 19 ప్రపంచ కప్ ను తొలిసారి గెలుచుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు భారత క్రికెటర్ల పట్ల అతి ప్రవర్తించారు. భారత్ ను మూడు వికెట్ల తేడాతో డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ ఫైనల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ పై విరుచుకుపడ్డారు. అగ్రెసివ్ బౌలింగ్ తో భారత బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టారు. 

షోరిఫుల్ ఇస్లామ్, తంజీమ్ హసన్ షకీబ్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదే సమయంలో భారత బ్యాట్స్ మెన్ పై దూషణలకు దిగారు. రకీబుల్ హసన్ విజయానికి కావాల్సిన పరుగులు సాధించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్లు విజయోత్సాహంలో అతిగా ప్రవర్తించారు. ఉద్వేగానికి గురై మైదానంలో అతిగా ప్రవర్తించారు. 

భారత ఆటగాళ్ల వద్దకు వెళ్లి మాటల యుద్ధానికి దిగారు. దాంతో పరిస్థితి అగ్లీగా మారింది. దీంతో అంపైర్లు కలగజేసుకుని ఆటగాళ్లను వేరు చేయాల్సి వచ్చింది.

మ్యాచు పూర్తయిన తర్వాత బంగ్లాదేశీ ఆటగాళ్లు ఉద్వేగంతో మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. చాలా మంది పాకిస్తాన్ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ చూడడానికి ఇబ్బందికరంగా కూడా ఉండింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఓ బంగ్లాదేశ్ ఆటగాడిని దూసుకెళ్లి నెట్టేయడానికి భారత ఆటగాడు ప్రయత్నించాడు.  అంపైర్ జోక్యం చేసుకుని ఘర్షణను నివారించాడు.