తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జోష్ మొదలయింది. పండగకి కొత్త సినిమాల జోష్ తో పాటు ఈ సారి క్రికెట్ సమరం కూడా తోడవబోతుంది. మొన్ననే శ్రీలంకతో టి 20 సిరీస్ ను సునాయాసంగా గెల్చుకున్న టీం ఇండియా ఈ సారి బలమైన కంగారూలతో వన్డే సమరానికి సయ్యంటుంది. 

జనవరి 14 నుంచి భారత్‌, ఆస్ట్రేలియాలు వన్డే సమరంలో తలపడనున్నాయి. మూడు మ్యాచులతో కూడిన సిరీస్‌ చిన్నదే. కానీ ఈ వన్డే సిరీస్‌ ఫలితం ప్రభావం మాత్రం పెద్దగా ఉండనుంది! 

2016 తర్వాత భారత్‌ను సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించిన ఏకైక జట్టు ఆస్ట్రేలియా మాత్రమే. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి, వరల్డ్‌కప్‌కు జట్టు పునర్‌నిర్మాణం కోసం నిరుడు భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా అనూహ్యంగా వన్డే సిరీస్‌ను గెల్చుకుంది. 

కంగారూ జట్టు ఆ ఫలితాన్ని పునరావృతం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్‌ కోల్పోవటం నాయకుడిగా విరాట్‌ కోహ్లికి స్వదేశంలో ఎదురైన ఒక అరుదైన వైఫల్యం.

తాజా సిరీస్‌లో కెప్టెన్‌ కోహ్లి ఆ వైఫల్య రికార్డును చెరిపేయాలని భావిస్తున్నాడు. వరుసగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలు కోహ్లిసేన చేతిలో చిత్తయ్యాయి, ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు వంతు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. 

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌ టెస్టులో బాల్‌ టాంపరింగ్‌ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌ను చీకట్లోకి నెట్టింది. అప్పటి నాయకులు, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డెవిడ్‌ వార్నర్‌లు అవమానకర రీతిలో జట్టుకు దూరమయ్యారు. 

ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన కంగారూ బృందం, గెలుపు రుచి చూసేందుకు ఆపసోపాలు పడింది. ఆస్ట్రేలియా తన అణ్వాయుధం 'స్లెడ్జింగ్‌' ను పూర్తిగా మర్చిపోవడమే కాదు, ఒత్తిడి పరిస్థితుల్లో గెలుపు ఫార్ములాను సైతం మరిచిపోయింది. 

Also read: వన్డేలకు ధోనీ గుడ్ బై: తేల్చేసిన రవిశాస్త్రి, టీ20లపై ఇలా...

ఆ విపత్కర పరిస్థితుల్లో 2019 ప్రపంచకప్‌ జట్టు నిర్మాణం కోసం ఆస్ట్రేలియా జట్టు 2019 ఫిబ్రవరిలో భారత్‌లో అడుగుపెట్టింది. టి20 పోరులో తొలుత విశాఖలో భారత్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా, బెంగళూర్‌లోనూ అదే పునరావృతం చేసింది. 2-0తో తొలిసారి భారత్‌పై టీ20 సిరీస్‌ విజయం సాధించింది. 

ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న గ్లెన్‌ మాక్స్‌వెల్‌ లో ఆ సిరీస్‌ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆస్ట్రేలియాకు గొప్ప ఊరట అందించే విజయాన్ని అతను సాధించిపెట్టాడు. ఐదు మ్యాచుల వన్డే సిరీస్‌లో హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ మ్యాచుల్లో అలవోక విజయాలు సాధించిన కోహ్లిసేన సిరీస్‌ విజయం లాంఛనమే అనుకుంది. 

కానీ ఉత్కంఠగా ముగిసిన రాంచీ, మొహాలీ, ఢిల్లీ వన్డేల్లో ఆస్ట్రేలియా కండ్లుచెదిరే విజయాలను నమోదు చేసింది. భారత్‌కు పోటీనివ్వగలిగితే చాలు, అనే స్థితిలో ఉపఖండంలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా 2-0తో టీ20, 3-2తో వన్డే సిరీస్‌ ట్రోఫీలను ఎగరేసుకుపోయింది. ప్రపంచకప్‌ ముంగిట భారత్‌కు ఆ ఓటమి గట్టి షాక్‌ అని చెప్పక మాత్రం తప్పదు. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి స్వదేశంలో చవిచూసిన అరుదైన వైఫల్యం.

హోరాహోరీ గ్యారంటీ

ఏడాది తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ భారత పర్యటనకు వచ్చింది. ఈ సారి ఆడేది మూడు వన్డేలే అయినా, వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రేలియా శిబిరంలో ఇప్పుడు స్టీవ్‌ స్మిత్‌, డెవిడ్‌ వార్నర్‌లు వచ్చేశారు. 

టెస్టు క్రికెట్‌లో స్మిత్‌, విరాట్‌ స్థాయికి చేరుకుంటోన్న మార్నస్‌ లబుషేన్‌ ఉత్సాహంతో ఉన్నాడు. అన్ని విభాగాల్లోనూ భారత్‌కు సవాల్‌ విసరగలిగే బలం, బలగం ఆస్ట్రేలియా సొంతం. అండర్‌డాగ్‌గా వచ్చి రెండు సిరీస్‌లు సాధించిన కంగారూలు, ఇప్పుడు సమవుజ్జీగా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కుతూహలంతో కనిపిస్తున్నారు. 

వన్డే సిరీస్‌లో మూడు మ్యాచులు వరుసగా ముంబయి, రాజ్‌కోట్‌, బెంగళూర్‌లో జరుగనున్నాయి. సంప్రదాయంగా ఈ మూడు వేదికలు బ్యాటింగ్‌ స్వర్గధామాలు. భారత్‌, ఆస్ట్రేలియాలు పవర్‌ఫుల్‌ హిట్టర్లతో నిండి ఉన్నాయి. మూడు వన్డేల్లోనూ పరుగుల వరద ఖాయం.

వీరిద్దరిని మాత్రం మిస్సవకండి

2019లో రోహిత్‌ శర్మ శతక సునామీ సృష్టించాడు. వన్డేల్లో 1490 పరుగులు చేసిన రోహిత్‌ ఒక్క వరల్డ్‌కప్‌లోనే ఐదు సెంచరీలు బాదాడు. శ్రీలంకతో టీ20లకు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ శర్మ కంగారూలతో కయ్యానికి నూతనోత్సాహంతో వస్తున్నాడు. 

బ్యాటింగ్‌ అనుకూల వేదికల్లో వన్డేలు జరుగుతుండగా టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ మళ్లీ భారీ శతకాలు బాదే అవకాశం ఎక్కువ. మరో ఓపెనర్‌ కోసం ధావన్‌, రాహుల్‌ మధ్య పోటీ నెలకొనగా.. రోహిత్‌ శర్మ రాక టాప్‌ ఆర్డర్‌కు బలం చేకూర్చుతుంది. లక్ష్యాలను నిర్దేశించటంలో, భారీ ఛేదనల్లో భారత్‌కు రోహిత్‌ శర్మ అత్యంత కీలకం.

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేధం తర్వాత డెవిడ్‌ వార్నర్‌ కెరీర్‌పై ఎన్నో అనుమానాలు. ఐపీఎల్‌ 2019లో ఆరెంజ్‌ క్యాప్‌ గెల్చుకుని విమర్శకుల నోటికి తాళం వేసిన వార్నర్‌.. ఆ జోరు ప్రపంచకప్‌లోనూ చూపించాడు. ఆరు అర్ధ సెంచరీలతో 647 పరుగులు కొట్టాడు. 

Also read: అనవసర రికార్డును సొంతం చేసుకున్న సంజు సాంసన్...మరొకటి కాకుండా ఉండేనా...?

ఐపీఎల్‌, వరల్డ్‌కప్‌లు డెవిడ్‌ వార్నర్‌ను కొత్త కోణంలో చూపించాయి. సహజంగా విధ్వంసక ఆటతీరుతో ఎంతో మంది బౌలర్లను శిక్షించిన వార్నర్‌.. పునరాగమనంలో ఎదురుదాడితో పాటు ఇన్నింగ్స్‌ నిర్మాణకర్తగా మార్పుచెందడు. 

బలమైన ఎదురుదాడి, సహనం డెవిడ్‌ వార్నర్‌ను మరింత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా మార్చివేశాయి. ఇటీవల పాకిస్థాన్‌పై బాదిన టెస్టు ట్రిపుల్‌ సెంచరీ ఆ కోవలోకే వస్తుంది. వన్డే సిరీస్‌లో డెవిడ్‌ వార్నర్‌ నుంచి కోహ్లిసేన బౌలింగ్‌ దళానికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ పుణ్యమాని భారత పిచ్‌లపై మంచి అవగాహన, అనుభవం కలిగిన డెవిడ్‌ వార్నర్‌ సిరీస్‌లో ఒక మరో ప్రమాదకర బ్యాట్స్ మన్. 

మెన్ ఇన్ బ్లూ వర్సెస్ మెన్ ఇన్ ఎల్లో...  

మెన్‌ ఇన్‌ బ్లూ, మెన్‌ ఇన్‌ ఎల్లో సమరం ఎన్నో భావోద్వేగాలతో ముడిపడిన సిరీస్‌. ఇరు జట్లలో ఉత్తమ ఆటగాళ్లు ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మలుస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌ మధ్య అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ పోటీ నెలకొంది. 

ఆధునిక క్రికెట్‌లో కోహ్లి, స్మిత్‌ సమవుజ్జీలు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐదు రోజుల ఆటలో స్టీవ్‌ స్మిత్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉండగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కింగ్‌ కోహ్లిది తిరుగులేని పైచేయి. 

భారత్‌, ఆస్ట్రేలియా పోటీ అనగానే కోహ్లి, స్మిత్‌ సమరం గుర్తుకు వస్తుంది. 118 వన్డేల్లో 41 సగటుతో స్మిత్‌ 3810 పరుగులు చేశాడు. 86కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో  పరుగుల వరద పారించాడు. 

Also read: టాప్ లేపిన సైనీ: ఏకంగా 146 స్థానాలు ఎగబాకాడు

విరాట్‌ కోహ్లి 242 వన్డేల్లో దాదాపుగా 60 సగటుతో 11,609 పరుగులు చేశాడు. 93.28 స్ట్రైక్ రేట్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈ గణాంకాలు వన్డే క్రికెట్‌లో విరాట్‌ సూపర్‌స్టార్‌ అని నిరూపిస్తున్నాయి. 

భారత్‌లో ఆడిన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లో మాత్రం స్మిత్‌ కేవలం 170 పరుగులే చేశాడు. స్వదేశంలో కోహ్లి 89 ఇన్నింగ్స్‌ల్లో 60కిపైగా సగటుతో 4682 పరుగులు బాదాడు. భారత్‌లో ఐదు రోజుల ఆటలో చారిత్రక ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన స్మిత్‌ వన్డేల్లో అటువంటి ఇన్నింగ్స్‌ ఇప్పటివరకు ఆడలేదు. ఇప్పుడు ఆడాలని ఎదురుచూస్తున్నాడు. 

ఈ మూడు వన్డేల సిరీస్‌ను అందుకు మంచి అవకాశంగా ఎంచుకున్నాడు. టాప్‌ ఆర్డర్‌ కష్టాల్లో కూరుకున్నప్పుడు మిడిల్‌ ఆర్డర్‌లో స్మిత్‌ వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఛేదనలో విరాట్‌ కోహ్లి రికార్డులు అసమానం. కెరీర్‌ భీకర ఫామ్‌లో కొనసాగుతున్న విరాట్‌ కోహ్లి నాయకుడిగా, బ్యాట్స్‌మన్‌గా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. బౌలింగ్‌ విభాగంలో పాట్‌ కమిన్స్‌ జస్ప్రీత్ బుమ్రా ఆధిపత్య పోరు సైతం అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.