న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందని కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. జట్టుకు ధోనీ ఎప్పుడూ భారం కాదని అన్నాడు. ఐపిఎల్ ఫామ్ ధోనీకి కీలకమని ఆయన అన్నాడు. 

ధోనీతో తాను మాట్లాడినట్లు ఆయన తెలిపాడు. అయితే, తాము మాట్లాడుకున్న విషయాలు తమ మధ్యనే ఉంటాయని, బహుశా త్వరలో ధోనీ వన్డేలకు వీడ్కోలు పలికవచ్చునని రవిశాస్త్రి అన్నాడు. 

రాబోయే ఐపిఎల్ లో సత్తా చాటితే టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసే జట్టులో ధోనీ కచ్చితంగా ఉంటాడని ఆయన చెప్పాడు. ధోనీ ఫిట్నెస్ అద్భుతమని, ఆ విషయంలో కపిల్ దేవ్ తో ధోనీ తూగుతాడని ఆయన అన్నారు.

టెస్టు మ్యాచులను నాలుగురోజులకు కుదించాలనే ఐసిసి ప్రతిపాదనను మతిలేని చర్యగా ఆయన అభివర్ణించారు. చాలా కాలం ధోనీ అన్ని ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడాడని, అందుకు ధోనీని గౌరవించాలని ఆయన అన్నాడు. 

తాను ప్రస్తుతం ఉన్న వయస్సులో టీ20లు మాత్రమే ఆడాలని ధోనీ అనుకుంటున్నట్లు ఆయన తెలిపాడు. ధోనీ జట్టుకు భారం కాబోడని, అలా కావడం ధోనీకి ఇష్టం లేదని అన్నాడు.