కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న  సంగతి తెలిసిందే. క్రికెట్‌ది కూడా ఇదే పరిస్ధితి. ఐపీఎల్ నిర్వహణ వాయిదాపడటంతో బీసీసీఐ కూడా వేల కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదంలో ఉంది.

అటు ఆర్ధికంగా బలంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పరిస్ధితి కరోనా కారణంగా ఆందోళనకరంగా మారింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటం కోసం చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా జూన్ వరకు కొంతమంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

Also Read:జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఆరోజు రాత్రంతా ఏడ్చేశా.. కోహ్లీ

అయితే అప్పటి వరకు వారి ఉపాధి కోసం బోర్డు స్పాన్సర్లలో ఒకరైన ఊల్వర్డ్స్ సూపర్‌ మార్కెట్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని సీఏ ముఖ్య కార్యనిర్వాణాధికారి కెవిన్ రాబర్ట్స్ తెలిపారు.

దీనిపై ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఇతర సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న తమ సిబ్బంది, కల్చర్‌ టీమ్‌కు తాత్కాలికంగా ఇది ఉపాధిని అందిస్తుందని కెవిన్ అభిప్రాయపడ్డారు. సీజన్‌ను బట్టి బోర్డు టికెట్లతోనే 40-50 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని.. కానీ ప్రస్తుతం ఆదాయానికి మార్గం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల పట్ల తీసుకున్న నిర్ణయం బాధను కలిగించేదే అయినా.. వారి సంరక్షణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పరిస్ధితిని వారు అర్ధం చేసుకుంటారని కెవిన్ రాబర్ట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:కపిల్ దేవ్ న్యూలుక్... అభిమానులు షాక్

ప్రస్తుతం ఉద్యోగులకు 20 శాతం, అధికారులకు 80 శాతం వేతనాన్ని అందిస్తున్నామని.. జాతీయ కోచ్‌లు కూడా పార్ట్‌ టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకునేందుకు గాను భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కెవినె చెప్పారు.

కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే కరోనా కారణంగా దీని నిర్వహణ ఎలా అన్నదానిపై నిపుణులతో చర్చిస్తున్నట్లు కెవిన్ రాబర్ట్స్ వెల్లడించారు.